కొనసాగిన ఆపరేషన్ లంగ్స్ 2.0
319 ఆక్రమణల తొలగింపు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో చేపట్టిన ‘ఆపరేషన్ లంగ్స్ 2.0’రెండో రోజైన ఆదివారం కూడా కొనసాగింది. నగరంలోని అన్ని జోన్ల పరిధిలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, కట్టడాలను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఎనిమిది జోన్లలో కలిపి ఆదివారం ఒక్క రోజే మొత్తం 319 ఆక్రమణలను తొలగించినట్లు ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు వెల్లడించారు. జోన్–1లో క్లాక్ టవర్ నుంచి తగరపువలస జంక్షన్ వరకు 20, జోన్–2లో ఎండాడ నుంచి రుషికొండ 100 అడుగుల రోడ్డు వరకు 60, జోన్–3లో స్పోర్ట్స్ ఎరీనా నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ క్వార్టర్స్ వరకు, అలాగే మహాలక్ష్మీ అపార్టుమెంట్ నుంచి జాతీయ రహదారి(శివాజీ పార్క్ రోడ్డు) వరకు 42, జోన్–4లో లీలామహాల్ జంక్షన్ నుంచి సౌత్‌జైల్ రోడ్డు వరకు 27, జోన్–5లో ఇండస్ట్రీయల్ ఎస్టేట్ నుంచి మర్రిపాలెం జంక్షన్ వరకు 34, జోన్–6లో శ్రీనగర్ నుంచి దుర్గానగర్ రోడ్డు, బీసీ రోడ్డు జంక్షన్ నుంచి గంగవరం పోర్టు వరకు 53, జోన్–7లో ఎన్టీఆర్ విగ్రహం నుంచి చింతా వారి వీధి వరకు 18, జోన్–8లో ఆర్‌ఆర్ వెంకటాపురం నుంచి వేపగుంట వరకు, వేపగుంట జంక్షన్ నుంచి గోపాలపట్నం జంక్షన్ వరకు, అలాగే రైల్వేస్టేషన్ రోడ్డు వరకు మొత్తం 65 ఆక్రమణలను తొలగించినట్లు ప్రధాన సిటీ ప్లానర్ తెలిపారు.


