‘ఆల్పైన్‌’లో ఏపీ స్కేటర్ల స్వర్ణాల పంట | - | Sakshi
Sakshi News home page

‘ఆల్పైన్‌’లో ఏపీ స్కేటర్ల స్వర్ణాల పంట

Dec 14 2025 6:55 AM | Updated on Dec 14 2025 6:55 AM

‘ఆల్ప

‘ఆల్పైన్‌’లో ఏపీ స్కేటర్ల స్వర్ణాల పంట

విశాఖ స్పోర్ట్స్‌: జాతీయ రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా తొట్లకొండ సర్క్యూట్‌లో జరుగుతున్న ఆల్పైన్‌, డౌన్‌హిల్‌ ఈవెంట్లు శనివారంతో ఉత్సాహంగా ముగిశాయి. 12 ఏళ్లు పైబడిన వారి కోసం నిర్వహించిన ఈ పోటీల్లో ఆల్పైన్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ స్కేటర్లు సత్తాచాటి స్వర్ణాలు కై వసం చేసుకోగా, డౌన్‌హిల్‌లో తమిళనాడు రైడర్లు ఆధిపత్యం ప్రదర్శించారు.

ఆల్పైన్‌ స్కేటింగ్‌ ఇలా...

ఇన్‌లైన్‌ ఆల్పైన్‌ స్కేటింగ్‌ అనేది తారు రోడ్డుపై నిర్వహించే సాహసోపేతమైన క్రీడ. ఇందులో పాల్గొనేవారు వేగంతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి దూసుకుపోవాల్సి ఉంటుంది. థ్రిల్‌తో కూడిన ఈ రేస్‌లో చిన్న చేతికర్రల సహాయం తీసుకోవచ్చు. మార్గమధ్యలో ఉండే అవరోధాలను చాకచక్యంగా దాటుతూ రేస్‌ పూర్తి చేయాలి. ఈ క్లిష్టమైన అంశంలో ఆంధ్రప్రదేశ్‌ స్కేటర్లు అద్భుతంగా రాణించి ఏకంగా ఏడు స్వర్ణ పతకాలను కొల్లగొట్టారు.

డౌన్‌హిల్‌ స్కేటింగ్‌ ఇలా...

డౌన్‌హిల్‌ అంశంలో రైడర్లు స్కేట్‌బోర్డ్‌పై తమ శరీర బరువును నియంత్రించుకుంటూ ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు జారుతూ ప్రతిభ చూపాలి. ఇందులో శరీర బరువులో దాదాపు 80 శాతాన్ని ముందుకు వంచుతూ, బరువును మార్చుకుంటూ, దిగువ శరీరాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ వెళ్లడమే ఈ అంశంలోని ప్రత్యేకత. ఇందులో తమిళనాడు రైడ ర్లు చక్కటి ప్రదర్శనతో స్వర్ణాలు అందుకున్నారు.

ఆల్పైన్‌ విజేతలు వీరే..

12–15 ఏళ్ల బాలికల విభాగంలో వి.అమృత, బాలురలో జె.జశ్వంత్‌ విజేతలుగా నిలిచారు. 15–18 ఏళ్ల బాలుర విభాగంలో వెంకట నాగ మురళీ స్వర్ణం సాధించాడు. 18 ఏళ్లు పైబడిన(సీనియర్‌) మహిళల విభాగంలో వెంకట రమ్యశ్రీ, పురుషుల విభాగంలో వెంకట పవన్‌ విజేతలుగా నిలిచారు. వీరంతా ఏపీకి చెందిన వారే. 15–18 ఏళ్ల బాలికల విభాగంలో మాత్రం తమిళనాడుకు చెందిన అహల్య విజేతగా నిలిచింది.

డౌన్‌హిల్‌ విజేతలు వీరే..

12–15 ఏళ్ల బాలికల విభాగంలో ఎస్‌.నందిని, బాలురలో ఎస్‌.పవన్‌, 15–18 ఏళ్ల బాలికల విభాగంలో శృతి, బాలురలో గురు హర్షన్‌, 18 ఏళ్లు పైబడిన మహిళల విభాగంలో వర్షిణి, పురుషుల విభాగంలో కిశోర్‌ కృష్ణ విజేతలుగా నిలిచారు. వీరంతా తమిళనాడుకు చెందినవారు. ఆంధ్ర స్కేటర్లు ఐశ్వర్య, రమ్యశ్రీ, మనస్వి కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.

రోడ్‌ రేస్‌(వన్‌ ల్యాప్‌) ఫలితాలిలా..

12–15 ఏళ్ల బాలికల విభాగంలో అనుష్క తైగల్‌ (యూపీ), బాలురలో శంతను అగర్వాల్‌ (హర్యానా), 15–18 ఏళ్ల బాలికల విభాగంలో అరుంధతి సహాని(తమిళనాడు), బాలురలో సంజయ్‌ (తమిళనాడు), 18 ఏళ్లు పైబడిన మహిళల విభాగంలో ఎం.కల్పన (తమిళనాడు), పురుషుల విభాగంలో ఆర్యన్‌పాల్‌ సింగ్‌ (హర్యానా) ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకాలు సాధించారు.

డౌన్‌హిల్‌లో సత్తాచాటిన తమిళనాడు రైడర్లు

‘ఆల్పైన్‌’లో ఏపీ స్కేటర్ల స్వర్ణాల పంట 1
1/1

‘ఆల్పైన్‌’లో ఏపీ స్కేటర్ల స్వర్ణాల పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement