పోలీసుల ఆరోగ్య భద్రతే లక్ష్యం
విశాఖ సిటీ: సమాజ భద్రత కోసం అహర్నిశలు ఒత్తిడితో కూడిన విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, వారి కుటుంబాల భద్రతే తన లక్ష్యమని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. శనివారం పోలీస్ సమావేశ మందిరంలో పోలీస్ కుటుంబాల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ జరగని విధంగా విశాఖలో తొలిసారిగా పోలీసుల ఆరోగ్య భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే పోలీస్ కుటుంబాలకు రూ.47 లక్షలతో ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు వెల్లడించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది కుటుంబాలకు చెందిన 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్లు వేయిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన చైతన్య స్రవంతి, నాట్కో ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఛారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఉపయోగాలను అందరికీ అవగాహన కల్పించేందుకు త్వరలోనే బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
హోంగార్డులకు ఆరోగ్య బీమా ఆలోచన
త్వరలో హోంగార్డుల కుటుంబాలకు ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్లతో పాటు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇందుకోసం దాతలు హోం గార్డ్స్ వెల్ఫేర్ ఫండ్‌కు నిధులు విరాళం ఇస్తే వారి కుటుంబాలకు ఆ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అలాగే పోలీసులు ఒత్తిడితో కూడిన విదులు నిర్వర్తిస్తుండడంతో ఎక్కువగా హృద్రోగంతో భాదపడుతున్నారని, ఇటువంటి ముప్పును ముందుగానే గుర్తించేందుకు అవసరమైన పరీక్షలకు కూడా దాతలు, స్వచ్ఛంద, ఇతర సంస్థలు సహకరించాలని కోరారు.


