గురుకుల కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్య
మృతుడుది శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో మజ్జాడపేట
మధురవాడ: మారికవలసలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కాంట్రాక్ట్ మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్న మజ్జాడ ఉమా మహేష్ (27) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని మజ్జాడ పేటకు చెందిన మహేష్ నాలుగేళ్లుగా ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం 11.30 గంటల సమయం దాటినా అతను తన గదిలో నుంచి బయటకు రాకపోవడంతో సహచర సిబ్బంది గమనించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్ సమాచారం మేరకు, పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మహేష్ శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. సకాలంలో వివాహం కాకపోవడం,ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఇదిలావుండగా ఉద్యోగ సమస్యలు వల్లే మా కుమారుడు ఆత్మచేసుకుని ఉంటాడని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. తండ్రి మజ్జాడ నారాయణరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


