నేడు బాటలు
నాటి అడుగులు..
విశాఖ సిటీ: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు విద్యార్థులకు వరంగా మారాయి. యూనివర్సిటీ విద్యా విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఏయూలో సరికొత్త కేంద్రం ఏర్పాటుకు అడుగులు పెడుతున్నాయి. అలాగే ఏయూలో బీటెక్ రెండేళ్లు పూర్తి చేసి ప్రతిభ చూపించిన విద్యార్థులకు వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో ప్రవేశం పొందే అవకాశం కలగనుంది. ఇందుకు సంబంధించి గత ఒప్పందాలకు కొనసాగింపుగా మరో ఎంవోయూపై వెస్ట్రన్ యూనివర్సిటీ వీసీ అమిత్ చక్మా, ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ సంతకాలు చేశారు.
2023లోనే ఆస్ట్రేలియన్ కార్నర్‌కు ఒప్పందం
ఏయూలో ఆస్ట్రేలియన్ కార్నర్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో ఏయూ అధికారులు నిర్ణయించారు. దీని కోసం 2022లో వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అమిత్ చక్మా ఏయూను సందర్శించారు. అనంతరం సీఎంవో ఆఫీస్ సూచనల మేరకు వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం, అప్పటి రాష్ట్ర ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఏయూను సందర్శించారు. ఏయూలో అమెరికన్ కార్నర్ పక్కనే ఆస్ట్రేలియన్ కార్నర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్నర్‌ను 2023 డిసెంబర్‌లోనే ప్రారంభించారు. అదే ఏడాది బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించాలని భావించారు. అలాగే ఇంకుబేషన్ కార్యక్రమాలకు మెంటరింగ్ అందించడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం, వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం మధ్య ఆన్‌లైన్ ద్వారా ఎంవోయూ కూడా జరిగింది.
ఇప్పుడు అదే ఒప్పందానికి మళ్లీ..
గతంలో జరిగిన ఒప్పందాలకు కొనసాగింపుగా తాజాగా మరో ఒప్పందానికి ఏయూ అధికారులు శ్రీకారం చుట్టారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ వీసీ చక్మా శుక్రవారం ఏయూను సందర్శించారు. గతంలో చేసుకున్న ఒప్పందాలు, ప్రారంభించిన ఆస్ట్రేలియన్ కార్నర్ కేంద్రాన్ని పరిశీలించారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీకి భారత్‌లో ముంబై, చైన్నె నగరాల్లో క్యాంప్‌లు ఉన్నాయి. ఏయూలో వెయ్యి మందికి పైగా విదేశీ విద్యార్థులు ఉన్నట్లు వీసీ చక్మా గుర్తించారు. దీంతో ఏయూ విద్యార్థులకు వెస్ట్రన్ యూనివర్సిటీలో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. దీని కోసం శుక్రవారం ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ వీసీ చక్మా, ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఏయూలో రెండేళ్లు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తే వారి ప్రతిభ ఆధారంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో ప్రవేశం కల్పించనున్నారు. ఈ రెండేళ్లు విద్యార్థులు ఆస్ట్రేలియా వెళ్లి బీటెక్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ బీటెక్ కోర్సు కోసం ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కార్యక్రమం ఎంవోయూలో భాగంగా ఉంది. దీని ప్రకారం అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఏయూకు వచ్చి విద్యా బోధన చేయనున్నారు. అలాగే ఏయూ ప్రొఫెసర్లు సైతం ఆస్ట్రేలియా యూనివర్సిటీలో బోధించే అవకాశం కలగనుంది.
2023లో ఏయూలో ఆస్ట్రేలియన్ కార్నర్ ఏర్పాటుకు ఒప్పందం
ఇప్పుడు వెస్ట్రర్న్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో బీటెక్ విద్యకు అవకాశం
ఏయూలో బీటెక్ సీఎస్‌ఈలో రెండేళ్లు పూర్తి చేసి ప్రతిభ చూపించిన వారికి చాన్స్
మిగిలిన రెండేళ్లు వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో ప్రవేశం
వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ వీసీ అమిత్ చక్మా ఏయూ సందర్శన
గత ఒప్పందం కొనసాగింపుగా శుక్రవారం మరో ఎంవోయూ
నేడు బాటలు


