రీ సర్వేలో కాసుల వేట
మహారాణిపేట: జిల్లాలో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియ అవినీతికి అడ్డాగా మారింది. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాల్సిన కొందరు సర్వే ఉద్యోగులు.. అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. జీతాలు తీసుకుంటున్నప్పటికీ, అదనపు ఆదాయం కోసం రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. రీ సర్వేను సక్రమంగా పూర్తి చేయాలంటే రైతులు భారీగా ముడుపులు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మామూళ్లు ఇవ్వని పక్షంలో, లేనిపోని మెలికలు పెడుతూ దరఖాస్తులను పక్కన పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
64 గ్రామాల్లో నత్తనడకన సర్వే
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. పెందుర్తి, గాజువాక, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, విశాఖ రూరల్ మండలాల పరిధిలోని 64 గ్రామాల్లో రీ సర్వే పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డ్రోన్లు, రోవర్లు, జీపీఎస్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ప్రభుత్వ, జిరాయితీ, ఇనాం భూములను సర్వే నంబర్ల వారీగా రికార్డు చేస్తున్నారు. అయితే, రెండు విడతల సర్వే ఇంకా కొలిక్కి రాలేదు. మూడో విడత పనులు గొడవలు, వివాదాలతో స్తంభించిపోయాయి. ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై ఎవరివద్దా స్పష్టత లేదు.
ముడుపులు ఇస్తేనే మోక్షం
తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, గ్రామ రెవెన్యూ అధికారి తదితరులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. మండల సర్వేయర్, డివిజనల్ సర్వేయర్, చైన్‌మెన్, ఇతర సిబ్బంది సహకారంతో చేస్తున్న రీ సర్వేలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు చిన్నపాటి సాంకేతిక సమస్యలను సాకుగా చూపి సర్వేలను నిలుపుదల చేస్తున్నారు. చేతులు తడిపితేనే పనులు జరుగుతున్నాయి. మరోవైపు, ఈ వ్యవహారంలోకి దళారులు ప్రవేశించి, అధికారులకు సహకారం అందిస్తామంటూ అనధికార వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదేమని ప్రశ్నించిన రైతులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఘర్షణలకు దిగుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
రికార్డుల పేరుతో ..
క్షేత్రస్థాయిలో సాగులో ఒకరుంటే, పాత రెవెన్యూ రికార్డుల్లో మరొకరి పేరు ఉంటోంది. ఈ వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, ట్యాంక్ పోరంబోకు, గ్రామ కంఠం, ఇనాం భూముల విషయంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అన్నదమ్ముల తగాదాలు, కుటుంబ వివాదాలు ఉన్న భూముల్లో సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వాటిని మరింత జఠిలం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.


