కదంతొక్కిన అంగన్‌వాడీలు
బీచ్‌రోడ్డు : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించకుంటే.. సమ్మె చేసేందుకు సిద్ధమవుతామని అంగన్‌వాడీలు కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో కదంతొక్కారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా.. న్యాయం జరగకపోవడం అన్యాయమని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఆర్.కె.ఎస్.వి.కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే అంగన్‌వాడీలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్టుకోవాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, చట్ట ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని, 42 రోజుల సమ్మె కాలంలో అంగన్‌వాడీలు లేవనెత్తిన ప్రతి డిమాండ్‌ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటలక్ష్మి మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1,810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. ఫ్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంతోపాటు 5 సంవత్సరాల్లోపు పిల్లలందరూ అంగన్‌వాడీ సెంటర్లలో ఉండాలని జీవో ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షురాలు మణి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పి.శ్యామల. ఎం.వెంకట లక్ష్మి, ఎ.నూకరత్నం, పి.సీత, విజయ, సుబ్బలక్ష్మి, రాధ, మంజుల, ఐఎఫ్‌టీయూ నాయకులు లక్ష్మి, గీత, రామలక్ష్మి పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు సిద్ధం
కదంతొక్కిన అంగన్‌వాడీలు


