సోలార్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి
ఈపీడీసీఎల్ అధికారులతో చీఫ్ సెక్రటరీ విజయానంద్
సాక్షి, విశాఖపట్నం : ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ కార్యక్రమం ప్రారంభానికి, వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు చేపట్టబోయే శంకుస్థాపన కార్యక్రమాలకు ఈ నెలాఖరులోగా ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలు సిద్ధం కావాలని చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. సాగర్‌నగర్‌లోని సీఓఈఈటీ భవనంలో పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం, ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ రూఫ్ టాప్ సోలార్, పీఎం ఈ డ్రైవ్ పథకాలతో పాటు ఎంఎన్‌ఆర్‌ఈ, ఆర్‌డీఎస్‌ఎస్ ప్రాజెక్టులపై ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, నెడ్ క్యాప్ ఎండీ ఎం.కమలాకరబాబు, కలెక్టర్లు, ఈపీడీసీఎల్ అధికారులతో కలిసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఈపీడీసీఎల్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని సీఎండీ పృథ్వీతేజ్ వివరించారు. నెలకు 10 మెగావాట్ల చొప్పున జరుగుతున్న ఇన్‌స్టాలేషన్లను రోజుకు ఒక మెగావాట్ సామర్థ్యానికి పెంచేలా పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. చీఫ్ సెక్రటరీ విజయానంద్ మాట్లాడుతూ ఈపీడీసీఎల్ పరిధిలో 2 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి వచ్చే ఏడాది మార్చిలోగా సమ్మతి తీసుకొని వారి ఇళ్లపై రెండు కిలోవాట్ల చొప్పున మొత్తం 400 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ పనులను పూర్తి చేయాలన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద ఫీడర్ సోలరైజేషన్‌లో సంస్థ పరిధిలోని 8 జిల్లాల్లో 220 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా వెహికల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. సమావేశంలో అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్లు విజయ కె.ఎస్.రామసుందర రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎన్.ప్రభాకర రెడ్డి, ఈపీడీసీఎల్ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎంలు ఎల్.దైవప్రసాద్, వి.విజయలలిత, బి.అశోక్ కుమార్, పి.శ్రీనివాస్, ఎస్‌ఈలు, ఈఈలు పాల్గొన్నారు.
రేపటి నుంచి ఇంధన పరిరక్షణ వారోత్సవాలు
ఇంధన పరిరక్షణ వారోత్సవాల పోస్టర్‌ను చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 14 నుంచి 20 వరకు ఇంధన పరిరక్షణ వారోత్సవాలను నిర్వహించి ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన పెంపొందించాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించాలన్నారు.


