ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం : ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా విశాఖపట్నం అవతరించబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ హౌస్ కంపెనీగా ఉన్న కాగ్నిజెంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తూ విశాఖలో అడుగుపెట్టిందన్నారు. ఏఐ, డేటా సెంటర్లతో విశాఖ.. ఐటీ డెస్టినేషన్‌గా నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా తయారవుతోందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం, మెట్రో లాంటి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు వస్తాయని వెల్లడించారు. నౌకాదళ కేంద్రం నుంచి టూరిజం కేంద్రంగా, ఇప్పుడు టెక్ సిటీగా విశాఖ ఎదిగిందని తెలిపారు. గూగుల్ కూడా త్వరలోనే డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోందనీ.. 2032కి 130 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా విశాఖ ఎకనామిక్ రీజియన్ తయారవుతుందని ఆకాంక్షించారు. కాగ్నిజెంట్‌తో పాటు.. టెక్ తమ్మిన, సత్వా డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ వంటి సంస్థలకు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం రుషికొండలో జరిగిన వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ కై లాసగిరి నుంచి భీమిలి వరకు తీర ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటకానికి కోర్ సిటీగా అభివృద్ధి చేయాలని మాస్టర్ ప్లాన్‌లో రూపొందించామన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు కె.అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్రతో పాటు సీఎస్ విజయానంద్, 9 జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.


