నకిలీ పత్రాల తయారీకి పాల్పడిన ఇద్దరి అరెస్ట్
మునగపాక: నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లతో పాటు తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్న ఇద్దరిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు. విశాఖపట్నం ఎండాడకు చెందిన దౌర్ల అనురాధ, తగరపువలసకు చెందిన తూము రాజు, మరో తొమ్మిది మందితో కలిసి నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, మరణ ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి ఇటీవల మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రెండు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్లు రిజిస్ట్రర్ చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఇద్దరు వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేని ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ముందస్తు కుట్రలో భాగంగా నకిలీ పత్రాలు రూపొందించినట్లు తేలిందన్నారు. ఈ కేసులో మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసి మంగళవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను మునగపాకలో తయారు చేసినట్టు తెలిసింది.


