మహా నగరం.. దోమలతో నిత్యం నరకం
మహారాణిపేట: స్మార్ట్ సిటీ విశాఖలో పారిశుధ్యం పడకేసింది. ఎటు చూసినా పేరుకుపోతున్న చెత్త, మురుగు కాలువల్లో పూడికలు తీయకపోవడంతో నగరం దోమలకు నిలయంగా మారింది. ఫలితంగా విశాఖ వాసులు విష జ్వరాల బారిన పడి విలవిలలాడుతున్నారు. ఒకవైపు పెరుగుతున్న చలి తీవ్రత, మరోవైపు పారిశుధ్య లోపం వెరసి దోమలు స్వైర విహారం చేస్తుండటంతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు పంజా విసురుతున్నాయి. దీనికి తోడు స్క్రబ్ టైఫస్ కేసులు కూడా నమోదవుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. జ్వరాలను నియంత్రణ చేయాల్సిన ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడుతోంది.
పేరుకుపోతున్న చెత్త : నగరంలో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా పూర్ణామార్కెట్ వెనుకభాగం, దొండపర్తి–లలితానగర్ (వంతెన వద్ద), వెలంపేట, రేసవానిపాలెం ఐటీ సంస్థ ప్రాంతం, ప్రసాద్ గార్డెన్స్, రెల్లివీధి, పంజా జంక్షన్, అల్లిపురం, రామకృష్ణ జంక్షన్ రైతుబజార్ తదితర ప్రాంతాలు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. రెండు, మూడు రోజులు పారిశుధ్య కార్మికులకు వరస సెలవులు వస్తే పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. కాలువల్లో పూడికలు సకాలంలో తీయకపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి.
కిటకిటలాడుతున్న ఆసుపత్రులు : దోమల విజృంభణతో కేజీహెచ్ సహా నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు జ్వర పీడితులు పోటెత్తుతున్నారు. రోజురోజుకూ డెంగ్యూ బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ జ్వరాల కంటే డెంగ్యూ అత్యంత ప్రమాదకరమని, ఇందులో ప్లేట్‌లెట్స్ వేగంగా పడిపోతాయని, సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేజీహెచ్‌లోని భావనగర్ వార్డు ఏఎంసీ యూనిట్‌లో జ్వర బాధితుల కోసం ప్రత్యేకంగా 20 పడకలు ఏర్పాటు చేశారు. రోజువారీ ఓపీకి వస్తున్న వారిలో 10 నుంచి 20 మందికి పైగా జ్వర బాధితులే ఉంటున్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు.
సమన్వయలోపం : జ్వరాల నియంత్రణలో మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జిల్లా మలేరియా అధికారి ఎం.తులసి మాట్లాడుతూ.. ‘కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు, ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నాం. డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంచాం’ అని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో పారిశుధ్యం మెరుగుపడకపోతే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.


