కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.67.78 లక్షలు
డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సోమవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ 8 వరకు (40 రోజులకు) హుండీల ద్వారా వచ్చిన నగదు, బంగారం, వెండి, ఇతర కానుకలను లెక్కించారు. ఈ హుండీ లెక్కింపు ద్వారా ఆలయానికి మొత్తం రూ. 67,78,784 ఆదాయం సమకూరింది. దీంతో పాటు 46 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 669 గ్రాముల వెండి కానుకల రూపంలో లభించాయి. 100 శ్రీలంక కరెన్సీ, 2 యూఎస్‌ఏ డాలర్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన 5 కరెన్సీ, 10 కెనడా డాలర్లు ఉన్నాయి. హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈవో కె. శోభారాణి, జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖాధికారి టి. అన్నపూర్ణ, ఇన్‌స్పెక్టర్ ఎం. శ్రీధర్, ఉత్సవ కమిటీ సభ్యులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ మేనేజర్ డి. రాజు, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, గోపాలపట్నం శ్రీహరిసేవా సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


