అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు
పీజీఆర్‌ఎస్‌లో అధికారులను హెచ్చరించిన
కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్లో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ కీలక సూచనలు చేశారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని, సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒకే సమస్యపై పదేపదే ఫిర్యాదులు వస్తే ఇక నుంచి ఉపేక్షించేది లేదని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా ప్రతి ఫిర్యాదుపై చర్య తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే, అర్జీదారునికి ఎందుకు పరిష్కారం కాలేదో సహేతుక కారణాలతో వివరించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం గ్రీవెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆడిట్ బృందాలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు.
292 వినతులు స్వీకరణ: సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 292 వినతులు సమర్పించారు. వీటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించినవి 108 ఉండగా, జీవీఎంసీకి 83, పోలీస్ విభాగానికి 18, ఇతర విభాగాలకు చెందినవి 83 అర్జీలు ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఇన్‌చార్జి డీఆర్వో సత్తిబాబు, ఏడీసీ వర్మలు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో అన్ని విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


