మల్టీప్లెక్స్‌లో ఉచిత పార్కింగ్ అమలు చేయాలి
డాబాగార్డెన్స్ : మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజుల నియంత్రణకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు (జీవో 44)ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అదనపు కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. జీవో 44 ప్రకారం.. వాణిజ్య సంస్థల్లో మొదటి 30 నిమిషాలు పూర్తి ఉచితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. 30 నిమిషాలు దాటి ఒక గంటలోపు, ఏదైనా షాపింగ్ చేసిన బిల్లు లేదా సినిమా టికెట్ చూపించినా పూర్తి ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని పొందవచ్చని రాజీవ్‌గాంధీ గుర్తు చేశారు. ఒకవేళ గంట దాటినా, షాపింగ్ బిల్లు/టికెట్ ధర పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ ఉంటే అప్పుడు కూడా పార్కింగ్ ఉచితమేనని తెలిపారు. ప్రస్తుతం అనేక వాణిజ్య సంస్థలు ఈ నియమాలను ఉల్లంఘిస్తూ అధిక పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయని, పౌరులపై భారం పడకుండా తక్షణమే ఈ సమస్య పరిష్కరించాలని ఆయన వినతిలో కోరారు. పార్కింగ్ ఫీజుల నియంత్రణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం, ఫిర్యాదులపై ప్రత్యేక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేయడం, నియమాలు అతిక్రమించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పౌర హక్కులను కాపాడడంలో జీవీఎంసీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు పౌరుల తరపున నిరంతరం పోరాటం చేస్తామని కొండా రాజీవ్‌గాంధీ మీడియాకు తెలియజేశారు.


