జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 86 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ అంశాలపై మొత్తం 86 వినతులు వచ్చాయి. అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ఈ ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధికంగా 33, ఇంజినీరింగ్ విభాగానికి 18, రెవెన్యూ విభాగానికి 12 ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను అదనపు కమిషనర్ ఆదేశించారు.
శిథిల భవనం తొలగింపుపై వినతి
జీవీఎంసీ 29వ వార్డు దిబ్బలపాలెం రామాలయం వద్ద శిథిలావస్థలో ఉన్న పాత భవనం, ఆలయానికి ఇబ్బందికరంగా ఉన్న చెట్టును తొలగించాలని శ్రీసీతారామ సేవా సంఘం అధ్యక్షుడు చందక అప్పలరాజు అదనపు కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. శిథిల భవనం నుంచి పాములు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయమై గత నాలుగేళ్లుగా అనేక మార్లు ఫిర్యాదు చేసినా, అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. స్థానికుల భద్రత దృష్ట్యా తక్షణమే ఆ భవనం, చెట్టును తొలగించాలని అప్పలరాజు కోరారు. కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ పీవీవీ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


