రాజకీయాలకు కులాన్ని ఆపాదించవద్దు
ఆరిలోవ: కులం రాజకీయాలకు అతీతంగా ఉండాలని, అది తల్లి లాంటిదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ముడసర్లోవ పార్కులో కాపు యువసేన ఆధ్వర్యంలో వనసమారాధన ఘనంగా జరిగింది. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు వేలాది మంది కాపు సామాజిక వర్గీయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు అతిథులను అలరించాయి. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆత్మీయ కలయిక పేరుతో వేలమందిని ఒకే వేదికపైకి తెచ్చిన కాపు యువసేన అధ్యక్షుడు సేనాపతి వెంకటేష్‌ను అభినందించారు. ‘రాజకీయాలకు కులాన్ని ఆపాదించకూడదు. కులం తల్లి లాంటిది. ఎవరైనా తన కులం పేరును ధైర్యంగా చెప్పుకోవాలి. రాజకీయాల్లోకి వచ్చాక అన్ని వర్గాల సహకారం వల్లే నేను ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచాను. కానీ నా కులం వల్లే మంత్రిని అయ్యాను.’ అని బొత్స వ్యాఖ్యానించారు. కులస్తులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుని, సహకారం అందించేలా కుల సంఘాలు ఉండాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పాలవలస యశస్విని, శివశంకర్ తదితరులు ప్రసంగించారు. కాపులంతా ఐకమత్యంతో ఉండాలని, రాజకీయంగా ఎదగడానికి అందరూ సహకరించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, కొండా రాజీవ్ గాంధీ, ఆకుల అప్పలసూరి, పంచకర్ల సందీప్, గంట్ల శ్రీనుబాబు, పెద్దింటి ఉషశ్రీ, మజ్జి దేవిశ్రీ, ఏడువాక సన్యాసిరావు, అన్నం తిరుపతిరావు, బండి నరేష్, పోతు ప్రసాద్, డాక్టర్ నాగరాజు, పలక శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.


