రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా
డాబాగార్డెన్స్: నగరంలో రాత్రివేళ పారిశుధ్య పనులను మెరుగుపరచడమే లక్ష్యంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జోన్–3, 4 పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, సత్యం జంక్షన్, సీతమ్మధార, డైమండ్ పార్క్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు చిత్తశుద్ధితో పనిచేయాలని, నగర సుందరీకరణలో రాత్రివేళ పనులు కీలకమని కమిషనర్ సూచించారు. దుకాణాల ముందు చెత్త వేస్తూ నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులను గుర్తించి.. రాత్రి వేళల్లో ‘షీ’ టీమ్స్ ద్వారా భారీ జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక (ప్యాకేజ్–15) ఫుట్‌పాత్‌లపై అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసిన వారిపై టౌన్ ప్లానింగ్ విభాగం సహకారంతో రూ.10 వేల జరిమానా విధించాలని లేదా తొలగించాలని ఆదేశించారు. రాత్రి విధుల్లో ఉన్న 375 మంది కార్మికుల్లో 12 శాతం మంది గైర్హాజరైనట్లు గుర్తించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఎస్‌ఎస్–2 అధికారి క్షేత్రస్థాయిలో లేకపోవడం, సిబ్బంది హాజరు వివరాలు లేకపోవడంతో కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ప్రతి ప్రాంతం శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులకు కమిషనర్ స్పష్టం చేశారు.


