పూర్వ విద్యార్థుల సహకారం.. వర్సిటీకి వరం
ఏయూ వీసీ రాజశేఖర్
మద్దిలపాలెం: ఆంధ్రవిశ్వవిద్యాలయ అభివృద్ధికి పూర్వ విద్యా ర్థులు అందిస్తున్న సహకారం నిరుపమానమని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ కొనియాడారు. ఆదివారం ఏయూ ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల సమావేశాలు జరిగాయి. 1975 ఎమ్మెస్సీ ఫిజిక్స్ బ్యాచ్ స్వర్ణోత్సవ సమావేశాన్ని ఫిజిక్స్ విభాగంలో నిర్వహించారు. అలాగే ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలోని వై.వి.ఎస్ మూర్తి ఆడిటోరియంలో ఇంజినీరింగ్ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం 11వ వార్షిక సర్వసభ్య సమావేశం, ఆత్మీయ సమ్మేళనం జరిగాయి. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలకు వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విశ్వవిద్యాలయ వికాసానికి, మౌలిక వసతుల కల్పనకు పూర్వవిద్యార్థులు విలువైన సహకారాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ కళాశాల పూర్వవిద్యార్థులు స్వయంగా హాస్టల్ భవన సదుపాయాన్ని కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 1975 ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్వవిద్యార్థుల సమావేశం విశ్రాంత ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ ఆర్.కామేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి రాఘవేంద్రమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 ఏళ్ల కిందట చదువుకున్నవారంతా ఇలా ఒకే వేదికపై కలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. వై.వి.ఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ప్రత్యేక అతిథిగా లాన్సమ్ ప్రాజెక్ట్స్ చైర్మన్, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పూర్వవిద్యార్థి కె.ఉమేష్, రెక్టార్ ఆచార్య పి.కింగ్, మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.పద్మశ్రీ ప్రసంగించారు. విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.


