22 నుంచి అవుట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మె బాట
డాబాగార్డెన్స్: వాటర్ సప్లయ్, యూజీడీ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మె బాట పట్టనున్నారని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మహదేవ్ ఆనందరావు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తిని ఆయా విభాగాల అవుట్ సోర్సింగ్ కార్మికులతో కలిసి సమ్మె నోటీస్ అందజేశారు. కౌన్సిల్ తీర్మానాలు, ప్రభుత్వ జీవోలు అమలు చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. జీవీఎంసీలో మంచినీటి సరఫరా విభాగంలో టెక్నికల్ విధులు నిర్వహిస్తున్న వాటర్ సప్లయ్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు.. కౌన్సిల్ తీర్మానం మేరకు కేటగిరీ–1 కింద 148 మందికి రూ.24,500, కేటగిరీ–2 కింద 818 మందికి రూ.21, 500, కేటగిరీ–3 కింద 261 మందికి రూ.18,500 చెల్లించాలన్నారు. అలాగే యూజీడీ వర్కర్స్‌కు, కెనాల్ సిల్ట్ వర్కర్స్‌కు గతేడాది మార్చి ఒకటి నుంచి రావల్సిన ఏరియర్స్ చెల్లించాలని, మంచినీటి సరఫరా విభాగంలో అవుట్ సోర్సింగ్ కార్మి కులకు గతేడాది డిసెంబర్ నుంచి రావాల్సిన ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 22 నుంచి కార్మికులు సమ్మె బాట పట్టనున్నారని తెలిపారు. అదనపు కమిషనర్‌ను కలిసిన వారిలో ప్రధాన కార్యదర్శి రెల్లి సత్యం, నాయకులు, కార్మికులు ఉన్నారు.


