ఏడో వేతన సంఘ సిఫార్సుల మేరకు పెన్షన్ రివిజన్
అనకాపల్లి: బీఎస్‌ఎన్‌ఎల్ విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ రివిజన్ ఏడో వేతన సంఘ సిఫార్సుల మేరకు 2.57 ఫార్ములా ప్రకారం జరగాల్సిందేనని ఆలిండియా బీఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ కార్యదర్శి డబ్బీరు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక వివేకానంద ఫంక్షన్ హాల్లో ఉమ్మడి విశాఖ జిల్లా బీఎస్‌ఎన్‌ఎల్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జిల్లా అధ్యక్షుడు కుప్పిలి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాట్ తీర్పుని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగా హైకోర్టులో అపీలు చేసిందన్నారు. ప్రస్తుతం విచారణ చివరి దశలో ఉందని, పెన్షనర్లకు అనుకూలమైన తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.ఆర్.పట్నాయక్ మాట్లాడుతూ పెన్షనర్లందరూ సంఘటితంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పెన్షన్ రివిజన్ సమస్యను పరిష్కరిస్తుందన్నారు.ఎనిమిదో వేతన సంఘ సిఫార్సుల్లో టేరమ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో పెన్షనర్లకు సంబంధించిన అంశాలను చేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని చెప్పారు. పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వాలిడేషన్ చట్టం 2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పెన్షనర్ల సంఘం బలోపేతంగా ఉందని గుర్తు చేశారు. జిల్లా కార్యదర్శి శ్యామసుందరం మాట్లాడుతూ పెన్షనర్ల నోషనల్ ఇంక్రిమెంట్‌పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని కోరారు.


