మహిళల భద్రతతోనే సాధికారత సాధ్యం
ఏయూక్యాంపస్ : మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించడం ద్వారా వారి సాధికారత సాధ్యపడుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జాతీయ స్థాయిలో నారి 2025 నివేదిక విశాఖ నగరాన్ని అత్యంత సురక్షిత నగరంగా ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏయూ కన్వెన్షన్ సెంటర్ వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచి విలువలు కలిగిన తరాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ, రాష్ట్ర ప్రగతికి కొలమానంగా మహిళల భద్రతే నిలుస్తుందన్నారు. పర్యాటకులు అధికంగా వచ్చే విశాఖలో పోలీసులు అందిస్తున్న భద్రత సత్ఫలితాలను ఇస్తోందన్నారు. పోక్సో కేసుల విషయంలో కఠిన శిక్షలు అమలు జరుగుతున్నాయన్నారు. గంజాయి, మత్తు పదార్థాల నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోక్సో కేసుల విషయంలో పనితీరు కనబరిచి దోషులకు శిక్షలు పడే విధంగా పనిచేసిన పోలీసు అధికారులు, న్యాయవాదులను వేదికపై సత్కరించారు. కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్, పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీ–2 మేరీ ప్రశాంతి, డీసీపీ–1 చందోలు మణికంఠ, డీసీపీ–క్రైం లతా మాధురి తదితరులు ప్రసంగించారు. ముందుగా కురుసుర మ్యూజియం వద్ద ర్యాలీ నిర్వహించారు.


