ప్రపంచ విజేతకు పట్టాభిషేకం
కరుణకుమారికి కలెక్టర్ ఘన సత్కారం
విశాఖ స్పోర్ట్స్: అంధుల మహిళా టీ–20 క్రికెట్ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పాంగి కరుణకుమారిని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారులు, అంధ పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు గురువారం కరుణకుమారిని జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ఊరేగించారు. అనంతరం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఆమెకు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘విభిన్న ప్రతిభావంతులు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే విజయం సాధిస్తారనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ కరుణకుమారి. డిజేబిలిటీ అనేది న్యూనత కాదు. సాధించాలనే పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఎవరైనా విజయం సాధించవచ్చు. ఒక కుగ్రామం నుంచి వచ్చిన బాలిక, అంతర్జాతీయ వేదికపై మెరిసి.. దేశానికి కప్‌ను అందించడం మనందరికీ గర్వకారణం’ అని అన్నారు. కరుణకుమారి రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకుందన్నారు. ఆమెను క్రమశిక్షణతో పెంచిన తల్లిదండ్రులకు, వెన్నంటి ప్రోత్సహించిన పాఠశాల ప్రిన్సిపాల్, కోచ్, అసోసియేషన్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కరుణకుమారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది విభిన్న ప్రతిభావంతులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రోత్సాహకరంగా కలెక్టర్ రూ.లక్ష చెక్‌ను, క్రికెట్ ఫర్ ది బ్లైండ్ రాష్ట్ర అధ్యక్షుడు శరత్ రూ.లక్ష చెక్‌ను అందజేశారు.
నాలాంటి వారికి చేయూతనివ్వాలి
తన విజయ రహస్యాన్ని, భవిష్యత్తు ఆకాంక్షలను కరుణకుమారి మీడియాతో పంచుకున్నారు. ‘అంధ పాఠశాలలో చేరాక అథ్లెటిక్స్ వైపు ఆసక్తి చూపించాను. పలు పోటీల్లో పతకాలను సాధించాను. నాకు క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని పాఠశాల యాజమాన్యం గుర్తించి ప్రోత్సహించింది. బంతి నుంచి వచ్చే శబ్దాన్ని విని బ్యాటింగ్ చేయడం అలవాటు చేసుకున్నాను. ఢిల్లీలో లభించిన ప్రాక్టీస్ వరల్డ్‌కప్‌లో నాకు ఎంతగానో ఉపయోగపడింది. నాకు ఇంత గుర్తింపు వస్తుందని ఊహించలేదు. నాలాంటి వారికి ఇలాంటి అవకాశాలు, చేయూత లభించాలన్నదే నా ఆకాంక్ష.’ అని వివరించింది.
తొలుత భయపడ్డాను.. ఇప్పుడు మురిసిపోతున్నాను
పాడేరులోని ఒక కుగ్రామం నుంచి వచ్చిన కరుణకుమారి ప్రయాణం పూల పాన్పు కాదు. ఈ విజయం వెనుక ఉన్న కష్టాన్ని ఆమె తండ్రి రాంబాబు వివరించారు. ‘7వ తరగతి వరకు అతి కష్టం మీద చదివించాను. స్థానికంగా వసతులు లేక ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. అయితే సాగర్‌నగర్‌లోని అంధుల పాఠశాలలో ప్రవేశం దొరకడంతో చదువుతో పాటు ఆటల్లో ప్రావీణ్యం సాధించడానికి అవకాశం చిక్కింది. మొదట బెంగళూరు తీసుకువెళతామంటే అయిష్టంగా ఒప్పుకున్నాను. ఢిల్లీ అంటే అసలు వద్దన్నాను. కానీ, కరుణ పట్టుదల చూసి అంగీకరించాను. మా అమ్మాయిని దేశ ప్రముఖులు ప్రశంసించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నా గ్రామస్తులందరూ ఆనందిస్తున్నారు.’అని చెప్పుకొచ్చారు.


