అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
డాబాగార్డెన్స్ : నగరంలో జీవీఎంసీ చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఇంజనీరింగ్ విభాగంపై అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణరాజు, పర్యవేక్షక ఇంజనీర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పబ్లిక్ వర్క్స్, మెకానిక్ పనులు, తాగునీటి సరఫరా వంటి వాటిపై సుదీర్ఘంగా చర్చించి అధికారులకు సూచనలు చేశారు. అభివృద్ధి పనుల అంచనాలు తయారు చేసేటప్పుడు పూర్తి వివరాలు పొందుపరచాలన్నారు. సేఫ్టీ కమిటీ నిర్ణయం మేరకే నగరంలో ప్రధాన రహదారులకు అదనంగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రాంట్లు, బడ్జెట్లకు అనుగుణంగా, అవసరం ఉన్న చోట అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఎంత కేటాయింపు జరిగింది, ఎంత ఖర్చు చేశారు, ఎంత విడుదల కావల్సి ఉందని అధికారులను ఆరా తీశారు. పీజీఆర్‌ఎస్‌లో రోడ్లపై గుంతలు, కాలువలు, తాగునీటి విభాగంపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. సుదీర్ఘకాలం నీటి చార్జీలు చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి కనెక్షన్లు తొలగించాలని ఆదేశించారు. బీచ్‌రోడ్డు ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పలు ప్రాజెక్టుల అమలుపై ఎస్‌ఆర్‌యూ టీం పవర్ పాయింట్ ప్రజంటేషన్ కమిషనర్ తిలకించారు.


