వేతన వాతలు
స్టీల్‌ప్లాంట్‌లో ఉత్పత్తి ఆధారిత వేతన విధానం అమలు కష్టపడి పనిచేస్తే పొట్ట కొట్టారని ఉద్యోగుల ఆగ్రహం
పనిచేసే వారికి 66 శాతం వీఆర్‌ఎస్ తీసుకున్న వారికి 100 శాతం జీతం యాజమాన్యం తీరుపై కార్మికుల కన్నెర్ర
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమను ఉద్ధరిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఒకవైపు ప్రకటనలు గుప్పిస్తూనే.. మరోవైపు సంస్థను మరింత కుంగదీసేలా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పావులు కదుపుతోంది. కొన్నాళ్లుగా ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లించని యాజమాన్యం.. ఇప్పుడు మరోసారి తన పంతం నెరవేర్చుకుంది. ఉత్పత్తికి తగ్గట్లుగానే వేతనాలు చెల్లిస్తామంటూ జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలంటూ ఉద్యో గ సంఘాలు పోరాడుతున్నప్పటికీ, యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తూ వారి భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేసింది. ఈ విధానం వల్ల కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాల్లో భారీ కోత పడగా.. వీఆర్‌ఎస్ తీసుకుని ఇంటి వద్ద ఉన్నవారికి మాత్రం 100 శాతం వేతనాలు చెల్లించడంపై సర్వ త్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏకపక్ష నిర్ణయంపై రీజినల్ లేబర్ కమిషనర్(ఆర్‌ఎల్‌సీ) సీరియస్ అయ్యారు. తక్షణమే ఆ సర్క్యులర్‌ను నిలిపివేసి, పెండింగ్ జీతాలు చెల్లించాలని ఆదేశించడం కార్మికులకు కాస్త ఊరటనిస్తోంది. అయితే ఈ ఆదేశాలను యాజమాన్యం అమలు చేస్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
పని చేసిన వారికి 66 శాతమే..
నిర్దేశించిన మేర ఉత్పత్తి సాధించలేదు కాబట్టే.. పూర్తిస్థాయి జీతాలు ఇవ్వడం లేదంటూ యాజమాన్యం స్పష్టం చేసింది. కష్టించి పనిచేసిన వారిలో ఏ ఒక్క విభాగానికి కూడా 100 శాతం వేతనాలు చెల్లించలేదు. కానీ.. వీఆర్‌ఎస్ తీసుకొని ఇంట్లో ఉన్న ఉద్యోగులకు మాత్రం పూర్తిస్థాయి జీతాలు చెల్లించడం గమనార్హం. అత్యల్పంగా మెటీరియల్ మేనేజ్‌మెంట్(ఎంఎం) విభాగం ఉద్యోగులకు 66 శాతం మాత్రమే చెల్లించారు. కోక్‌ఓవెన్స్ విభాగం ఉద్యోగులకు 93 శాతం, మార్కెటింగ్‌కు 84 శాతం, బ్లాస్ట్‌ఫర్నేస్‌కు 83 శాతం, ఎస్‌ఎంఎస్‌కు 81 శాతం, సింటర్‌ప్లాంట్‌కు 80 శాతం, రోలింగ్ మిల్స్ ఉద్యోగులకు 79 శాతం, ఇతర విభాగాలకు 83 శాతం చొప్పున మాత్రమే చెల్లింపులు జరగడంపై ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఉక్కును ముక్కలు చేసే కుట్ర?
ఒక్కో కఠిన నిర్ణయాన్ని అమలు చేస్తూ.. ప్లాంట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా యాజమాన్యంతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే నష్టాల ఊబిలో విశాఖ ఉక్కు కర్మాగారం కూరుకుపోయింది. ఈ క్రమంలో ఉద్యోగులను పొమ్మనలేక పొగబెట్టినట్లుగా బయటకు పంపించేందుకు చేయాల్సిన కుటిల ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు వరకు ఉక్కు ఉద్యమం సడలనివ్వమంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ, జనసేన నేతలు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత ఆ వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నారు. ఉక్కును ముక్కలు చేసేందుకు సిద్ధమయ్యారన్నది తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది. నిన్నమొన్నటి వరకూ పూర్తిస్థాయి జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేసిన యాజమాన్యం.. ఇప్పుడు ఉత్పత్తికి అనుగుణంగానే జీతాలు చెల్లించడంతో ఉద్యోగులు విలవిల్లాడుతున్నారు.
ఆర్‌ఎల్‌సీ ఆదేశాలు అమలయ్యేనా?
కార్మిక సంఘాల ఫిర్యాదు మేరకు స్పందించిన రీజనల్ లేబర్ కమిషనర్.. యాజమాన్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే నెల నుంచి ఈ సర్క్యులర్‌ను అమలు చేయొద్దని, ఈ నెలలో కోత విధించిన జీతాలను త్వరగా చెల్లించాలని ఆదేశించారు. అయితే, యాజమాన్యం ఈ ఆదేశాలను పాటిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.
తప్పు యాజమాన్యానిది.. శిక్ష ఉద్యోగులకా?
ఉత్పత్తి తగ్గిపోవడానికి ప్రభుత్వాల మద్దతుతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న యాజమాన్య వైఖరే ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. ‘పిండికొద్దీ రొట్టె’ అన్నట్లుగా.. వనరులు, వసతులు, ముడిసరుకు లభ్యత ఆధారంగానే ఉత్పత్తి సాధ్యమవుతుందన్న విషయం తెలిసి కూడా.. ఉద్యోగులను బలి చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది సింగిల్ ఫర్నేస్ మాత్రమే అందుబాటులో ఉండగా, రెండు ఫర్నేస్‌లను షట్‌డౌన్ చేశారు. అప్పుడు సింగిల్ ఫర్నేస్ లక్ష్యానికి అనుగుణంగా 90 శాతం ఉత్పత్తి సాధించారు. సాధారణంగా వర్షాకాలంలో నిర్వహణ కష్టమని తెలిసినా.. జూన్‌లో షట్‌డౌన్‌లో ఉన్న రెండు ఫర్నేస్‌లను ప్రారంభించారు. వర్షాకాలంలో రా మెటీరియల్ హ్యాండ్లింగ్ పాయింట్‌లో ఇబ్బందులు తలెత్తడం, ఎక్విప్‌మెంట్ ఆపరేటింగ్‌లో సమస్యలు రావడం సహజం. దీనికి తోడు సిబ్బంది కొరత ఉన్నప్పటికీ.. 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. సెయిల్‌లో మిలియన్ టన్నుకు 2,700 మంది ఉంటే, ఇక్కడ 1,350 మందే ఉన్నారు. నెలకు 9 రేక్‌ల ముడిసరుకు రావాల్సి ఉండగా, గత ఆరేడు నెలలుగా కేవలం 5 రేక్‌లు మాత్రమే వస్తున్నాయి. ముడిసరుకు లేకుండా ఉత్పత్తి ఎలా సాధ్యమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. నిధులు, వనరులు సమకూర్చకుండా.. ఉత్పత్తి రాలేదంటూ కార్మికుల పొట్టకొట్టడం కుట్రపూరితమని ఆరోపిస్తున్నారు.
అన్యాయమైన నిర్ణయమిది
ఉత్పత్తికి లింక్ పెట్టి జీతాల్లో కోత విధించడం కార్మికుల ఆర్థిక భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు వంటిది. ఏ సంస్థలోనైనా ఉత్పత్తి పెరిగితే ఇన్సెంటివ్‌లు ఇస్తారు కానీ, ఇలా జీతాలు కట్ చేయరు. ముడిసరుకు సకాలంలో అందించలేని, యంత్రాలకు మరమ్మతులు చేయించలేని యాజమాన్య చేతకానితనానికి కార్మికులను బాధ్యులను చేయడం దారుణం. – మంత్రి రాజశేఖర్,
స్టీల్ ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్
వేతన వాతలు


