కోక్‌ | - | Sakshi
Sakshi News home page

కోక్‌

Dec 2 2025 7:16 AM | Updated on Dec 2 2025 7:16 AM

కోక్‌

కోక్‌

నాసిరకం కోక్‌ కొనుగోలు చేస్తున్నట్లు

ఆరోపణలు

ఈ ఏడాది జూన్‌ నుంచి

బయటి మార్కెట్‌లో కొనుగోలు

2024లో మొత్తం ఉత్పత్తిలో 63 శాతం

ముడిఖనిజం ఖర్చు

ఈ ఏడాది 75 శాతం పెరగడంతో

నష్టాల ఊబిలో స్టీల్‌ప్లాంట్‌

బ్లాస్ట్‌ ఫర్నేస్‌ నిర్వహణ ఖర్చు రూ.15 కోట్ల

నుంచి రూ.85 కోట్లకు పెంపు

ప్లాంట్‌లో జరుగుతున్న అవినీతిపై సీబీఐ

విచారణకు కార్మిక సంఘాల డిమాండ్‌

దొంగలెవరు..?

ఉక్కులో

సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఉక్కు పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ వైపు చకచకా అడుగులు వేస్తూ.. ప్లాంట్‌ నిర్వీర్యానికి యాజమాన్యంతో కలిసి కుట్రలు పన్నుతున్నాయి. కోక్‌ కొనుగోళ్ల వ్యవహారంలో గోల్‌ మాల్‌ జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి బయట మార్కెట్‌లో కోక్‌ కొనుగోళ్లు చేస్తుండటం వెనుక భారీ స్కామ్‌ జరుగుతోందని వాదనలున్నాయి. ప్రపంచంలో ఏ ప్లాంట్‌లో లేని విధంగా ముడిఖనిజం ఖర్చు విలువ రోజు రోజుకీ పెరిగిపోతోంది. రా మెటీరియల్‌ ఖర్చు ఏడాది కాలంలో 63 నుంచి 75 శాతానికి పెరగడం వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్లాంట్‌లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై సీబీఐ విచారణకు పట్టుబడుతున్నారు.

నాణ్యత పరిశీలన లేకుండా కొనుగోళ్లు..!

స్టీల్‌ప్లాంట్‌ ఏటా దాదాపు 2.7 లక్షల టన్నుల కోల్‌ కొనుగోలు చేస్తుంటుంది. ఆస్ట్రేలియా, అమెరికా, ఇండోనేషియా, అమెరికా దేశాల నుంచి నాణ్యమైన కోకింగ్‌ కోల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఆస్ట్రేలియాలో కోల్‌ కొనుగోలు వల్ల అధిక భారం పడుతుందనే ఉద్దేశంతో ఈ ఏడాది మొదటి నుంచి ఆపేశారు. ఇదే అదనుగా కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. మన దేశంలో ఉన్న లోకల్‌ కంపెనీల నుంచి బొగ్గు కొనుగోళ్లు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి బొగ్గు కొనుగోలు చేసే ముందు నాణ్యత నిర్ధారణకు 10 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మధ్య కొనుగోలు చేసిన కోల్‌కు కొన్ని టెస్టులు చేయగా.. ఇది నాణ్యమైన కోల్‌ కాదని నివేదికలో స్పష్టమైనట్లు తెలుస్తోంది. కేవలం కమీషన్లకు కక్కుర్తి పడి.. కొందరు అధికారులు స్థానిక కంపెనీలతో చేతులు కలిపి.. నాసిరకం బొగ్గుని కొనుగోలు చేస్తున్నారంటూ ఆరోపణలొస్తున్నాయి. 2025 జూన్‌ వరకు రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల్లో రోజుకు 15 వేల టన్నుల చొప్పున 100 శాతం ఉత్పత్తి చేశారు. అయితే... జూన్‌ నుంచి ఉత్పత్తి 67 శాతానికి క్షీణించిందనీ.. దీనికి కారణం బయట మార్కెట్‌ నుంచి నాసిరకం కోక్‌ కొనుగోళ్లేనని తెలుస్తోంది.

ముడి ఖనిజంలోనూ

హస్తలాఘవం!

ఓవైపు ప్రైవేట్‌ చేతుల్లోకి వెళ్లకుండా ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఉద్యోగులు, కార్మికులు నిరంతరం పోరాటాలు చేస్తుంటే.. సందట్లో సడేమియా అన్నట్లుగా.. కొందరు ఉన్నతాధికారులు దొరికిన కాడికి దోచుకునేందుకు స్కెచ్‌ వేస్తున్నారు. కోక్‌ కొనుగోళ్లలోనే కాకుండా రా ఓర్‌ ఖర్చు విషయంలోనూ హస్తలాఘవం చూపిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2024లో మొత్తం ఉత్పత్తిలో ముడి ఖనిజాల ఖర్చు 63 శాతం ఉండగా.. 2025లో ముడి ఖనిజాల ఖర్చు 75 శాతానికి అమాంతంగా పెరిగింది. ప్రపంచంలో ఏ స్టీల్‌ప్లాంట్‌లోనూ ముడిఖనిజం ఖర్చు ఈ స్థాయిలో లేదని వివిధ సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. సెయిల్‌లో ముడిఖనిజం ఖర్చు సుమారు 50 శాతంగా ఉంటే.. స్టీల్‌ప్లాంట్‌లో ఇంత పెద్దమొత్తంలో ఒక్కసారిగా ఎందుకు పెరిగిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంతేకాకుండా.. ఉత్పత్తి వ్యయంలోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింటర్‌ ప్లాంట్‌లో 2 మిషన్లు నడపడానికి గతంలో రూ.19 కోట్లు వ్యయం ఉండగా.. ఇప్పుడది రూ.45 కోట్లకు పెంచేశారు. అదేవిధంగా.. బ్లాస్ట్‌ఫర్నేస్‌ మెయింటెనెన్స్‌ పనులకు గతంలో రూ.15 కోట్లు కాగా.. ఇప్పుడు అమాంతంగా రూ.85 కోట్లకు పెంచేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. స్టీల్‌ప్లాంట్‌లో జరుగుతున్న ఈ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీబీఐ విచారణ చేపట్టాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement