సుహం ఫార్మసీలో సోదాలు
పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుతో కదలిన
డ్రగ్ అధికారులు
ఎంవీపీ షాపు సీజ్, మరో రెండింటికి షోకాజ్ నోటీసులు
మహారాణిపేట: ధాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సుహం ఫార్మసీలో కాలం చెల్లిన మందులు, అధిక ధరలు, అవకతవకలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలకు దిగారు. నగరంలోని ఆరు సుహం ఫార్మసీలపై రెండు రోజులుగా మెరుపుదాడులు చేశారు. ఎంవీపీ కాలనీలో రెండు, కంచరపాలెం, మల్కాపురం, వన్‌టౌన్, ఇసుకతోట ప్రాంతాల్లో ఒక్కో ఫార్మసీ చొప్పున ఉన్నాయి. ఈ ఫార్మసీ షాపులపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసింది. ఈ ఫిర్యాదు మేరకే అధికారులు రంగంలోకి దిగారు. ఎంవీపీ బ్రాంచ్‌ను సీజ్ చేయగా, కంచరపాలెం, మల్కాపురం బ్రాంచ్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. తనిఖీల సమాచారం తెలుసుకున్న షాపుల నిర్వాహకులు ఎంవీపీలోని మరో బ్రాంచ్, ఇసుకతోట, వన్‌టౌన్ బ్రాంచ్‌లకు తాళాలు వేసేశారు. తనిఖీ సమయంలో రూ.80 వేల విలువ గల 55 రకాల ఔషధాలను ఫాం–16 కింద స్వాధీనం చేసుకున్నట్లు డ్రగ్ కంట్రోల్ అథారిటీ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.విజయకుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఔషధాల్లో రెండు రకాల నమూనాలను లేబొరేటరీకి పంపినట్లు పేర్కొన్నారు. సీజ్ వివరాల ఆధారంగా విశాఖ 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశామన్నారు. ఔషధ తనిఖీ అధికారి వి.అభిప్రియ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు ఈ తనిఖీలు నిర్వహించారు.


