సిరులతల్లీ.. ప్రణామం..
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మార్గశిర మాస శోభను సంతరించుకుంది. పసుపు కుంకుమల పరిమళాలు, వేద మంత్రాల ఘోష, నాదస్వరాల సవ్వడి నడుమ సిరుల తల్లి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. తొలి గురువారం సందర్భంగా అమ్మవారిని స్వర్ణాభరణాలు, వెండి కవచాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. బుధవారం అర్ధరాత్రి నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులతో బురుజుపేట జనసంద్రంగా మారింది.
అమ్మవారికి విశేష పూజలు
మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా తొలి గురువారం పూజలు వైభవంగా జరిగాయి. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణాలు, వేద పారాయణాలు, శ్రీ చక్రార్చన, లక్ష్మీ హోమం తదితర విశేష పూజలు చేశారు. పసుపు కుంకుమ నీళ్లతో అమ్మవారికి అభిషేకం జరిపారు. అనంతరం క్షీరాభిషేకం చేసి, పసుపు పూశారు. తర్వాత స్వర్ణాభరణ అలంకరణ చేసి.. బుధవారం అర్ధరాత్రి 12.05 నుంచి 1.30 గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వాటిని తొలగించి వెండి కవచాలు తొడిగారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కె.శోభారాణి, వేదపండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
అమ్మవారి సేవలో..
ధర్మ దర్శనంతో పాటు రూ.100, రూ.200, రూ.500(మార్గశిర విశిష్ట దర్శనం) టికెట్లను అందుబాటులో ఉంచారు. సీతారామస్వామి ఆలయం వైపు నుంచి వీవీఐపీ, వీఐపీతో పాటు వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లల తల్లులకు దర్శనం కల్పించారు. జగన్నాథస్వామి ఆలయ ప్రాంగణంలో సుమారు 5 వేల మందికి అన్నదానం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో ప్రసాదం కౌంటర్లు, వైద్య శిబిరాలు, మంచినీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు ప్రసాద వితరణ చేపట్టాయి. భక్తుల రద్దీ దృష్ట్యా జగదాంబ జంక్షన్, పూర్ణామార్కెట్, పాతపోస్టాఫీస్, టౌన్‌కొత్తరోడ్డు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించారు.
పోలీసుల పెత్తనం.. పాలకుల అత్యుత్సాహం
అమ్మవారి సన్నిధిలో అందరూ సమానమే అన్న మాట తొలి గురువారం అటకెక్కింది. ఓవైపు పోలీసుల పెత్తనం, మరోవైపు అధికార పార్టీల నాయకుల హడావిడితో సామాన్య భక్తులు ఇక్కట్లకు గురయ్యారు.
స్థానిక ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందిన వారు కావడంతో ఆ పార్టీ నాయకులు, కూటమిలోని టీడీపీ చోటా నేతలు ఆలయం వద్ద చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ‘అంతా మేమే’ అన్నట్లుగా వ్యవహరిస్తూ.. క్యూలను ఇష్టారాజ్యంగా మార్చేశారు. గంటల తరబడి క్యూల్లో పడిగాపులు కాస్తున్న సామాన్య భక్తులను పక్కన పెట్టి.. సిఫార్సు లేఖలు పట్టుకొచ్చిన వారికి, తమ అనుచరులకు వీఐపీ దర్శనాలు కల్పించారు. టికెట్లు కొనుగోలు చేయకుండా, కేవలం సిఫార్సు లేఖలతో దర్శనాలు ఎక్కువగా జరగడంతో ఆలయ ఆదాయానికి గండి పడింది. నాయకుల ఓవరాక్షన్ వల్ల సామాన్య భక్తులు తీవ్ర అసౌకర్యానికి, ఆవేదనకు గురయ్యారు.
సిరులతల్లీ.. ప్రణామం..
సిరులతల్లీ.. ప్రణామం..
సిరులతల్లీ.. ప్రణామం..
సిరులతల్లీ.. ప్రణామం..


