58 కేసుల్లో 77 మంది అరెస్ట్
విశాఖ సిటీ: నగరంలో నేరాల నియంత్రణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. గురువారం పోలీస్ సమావేశ మందిరంలో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అక్టోబర్‌లో నగరంలో 83 చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు. వీటిలో 58 కేసులు ఛేదించి 77 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రూ.3.10 లక్షల నగదు, 838.331 గ్రాముల బంగారం, 22 బైక్‌లు, ఎక్స్‌యూవీ కారు, 505 మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రూ.1,12,03,480 విలువైన సొత్తును రికవరీ చేశామన్నారు. నేర నియంత్రణలో భాగంగా అక్టోబర్‌లో నగరంలో 309 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో రాత్రి, పగలు ప్రత్యేకంగా పెట్రోలింగ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం బాధితులు పొగొట్టుకున్న సొత్తును సీపీ తన చేతుల మీదుగా వారికి అందజేశారు. సమావేశంలో డీసీపీ(క్రైమ్) లతామాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
58 కేసుల్లో 77 మంది అరెస్ట్


