నాకే నోటీసులు ఇస్తావా?
జీవీఎంసీ పరిధిలో సరిగా పనిచేయని స్వీపింగ్ యంత్రాలు హెల్పర్ లేకుండానే స్వీపింగ్ యంత్రాల నిర్వహణ సదరు కాంట్రాక్ట్ సంస్థకు నోటీసులు పంపిన ఏఈ కాంట్రాక్టర్ రాకేష్ చౌదరి నేరుగా ఏఈకి ఫోన్ చేసి బెదిరింపులు ఏడాదికి టెండర్లు పిలవకుండా వంతపాడుతున్న మెకానికల్ విభాగం అధికారులు నెల రోజుల టెండర్ పేరుతో నిషేధిత జాబితాలో ఉన్న సంస్థకు పనుల అప్పగింత
అడిగిన దానికి నువ్వే సమాధానం చెప్పు.. అయినా నేను ఆఫీసుకు రావడమేంటి?
స్వీపింగ్ యంత్రాలు పనిచేయడం లేదని నోటీసులు పంపిన ఏఈకే కాంట్రాక్టర్ బెదిరింపులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
జీవీఎంసీ పరిధిలో స్వీపింగ్ యంత్రాల కాంట్రాక్ట్ పొందిన రాజరాజేశ్వరి సంస్థ అధికార పార్టీ అండదండలున్నాయంటూ నిర్వహణను గాలికొదిలేసింది. ఈ యంత్రాల్లో కనీసం హైడ్రాలిక్ ఆయిల్‌ను సరిపడినంతగా వేయకపోవడంతో గ్రీజు కూడా సరిగ్గా రాయడం లేదు. వాటర్ స్ప్రింక్లర్లు పనిచేయకపోవడంతో పాటు పక్కన ఉండే రబ్బర్లు కూడా సరిగ్గా లేవు. దీంతో స్వీపింగ్ చేసే సమయంలో చిన్న చిన్న రేణువులు అలాగే రోడ్డుపైనే ఉండిపోతున్నాయి. సదరు కాంట్రాక్టర్ పూర్తి బిల్లులు తీసుకుంటూ స్వీపింగ్ యంత్రాలను తిప్పకుండా పక్కన పెట్టేయడం వంటి వ్యవహారాలను అధికారులు గమనించారు. ఈ నేపథ్యంలో జోన్–3కి చెందిన ఇన్‌చార్జి ఏఈ ప్రసాద్ సదరు రాజరాజేశ్వరి సంస్థకు నోటీసు జారీచేశారు. దీంతో రాజరాజేశ్వరి సంస్థకు చెందిన రాకేష్ చౌదరి.. ఏఈకి ఫోన్ చేసి నోటీసు ఇచ్చినందుకు సమాధానం చెప్పాలంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడటంతో పాటు ఆఫీసుకు ఎందుకు వస్తానంటూ హూంకరించారు. ఇది ఇప్పుడు జీవీఎంసీలో చర్చనీయాంశమవుతోంది. అసలు విజయవాడలో నిషేధిత జాబితాలో ఉన్న సంస్థకు ఇక్కడ టెండర్ దక్కడంలో జీవీఎంసీ మెకానికల్ విభాగానికి చెందిన అధికారుల మాయాజాలం కనిపిస్తోంది. అంతేకాకుండా సదరు సంస్థ కోసమే కేవలం నెల రోజుల టెండర్ పేరిట పనులు అప్పగిస్తున్న వ్యవహారమూ తాజాగా బయటకు వచ్చింది.
నెల రోజుల టెండర్..!
వాస్తవానికి రాజరాజేశ్వరి సంస్థపై మొదటి నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. గతంలో విజయవాడలో టెండర్ నిబంధనలకు అనుగుణంగా పనులు చేయడం లేదంటూ సదరు సంస్థను బ్లాక్‌లిస్టులో చేర్చినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ జీవీఎంసీ పరిధిలో 3 సీఎంటీ కెపాసిటి గల 4 స్వీపింగ్ యంత్రాల నిర్వహణ కాంట్రాక్టును కేవలం నెల రోజులకే సదరు సంస్థకు అప్పగించారు. వాస్తవానికి ఏడాదికి గాను 3, 6 సీఎంటీ స్వీపింగ్ యంత్రాల నిర్వహణకు సంబంధించి టెండర్లను పిలిచేందుకు ఆగస్టు 28న కౌన్సిల్‌లో ఆమోదించించింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఏడాది కాలానికి టెండర్లను పిలవకుండా నెల రోజుల టెండర్ పేరిట కాలయాపన చేస్తుండటం గమనార్హం. మొదట్లో 4 నెలల టెండర్‌ను అప్పగించిన జీవీఎంసీ మెకానికల్ విభాగం అధికారులు.. జీవీఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెల రోజుల టెండర్‌ను తెరమీదకు తేవడం గమనార్హం. ఒక్కో యంత్రాన్ని నిర్వహించేందుకుగానూ జీవీఎంసీ రూ.2.20 లక్షల చొప్పున చెల్లిస్తుంది. అయితే ఈ టెండర్‌లో పాల్గొనేందుకు రూ.5 లక్షలు బీజీ చెల్లించాలి. దీంతో వేరేవ్వరూ రాకుండా ఉండేందుకు నెల రోజుల టెండర్ పేరిట రాజరాజేశ్వరి సంస్థకు దోచిపెట్టేందుకు వీలుగా జీవీఎంసీ మెకానికల్ అధికారులు వ్యవహారం నడుపుతున్నారనే విమర్శలున్నాయి.
రాజరాజేశ్వరి రాకేష్ చౌదరి : హలో నేను రాజరాజేశ్వరి రాకేష్. ఈ నోటీసుకు మీనింగ్ ఏమిటి?
మెకానికల్ ఏఈ ప్రసాద్ : స్వీపింగ్ మిషన్లకు హెల్పర్‌ను పెట్టడం లేదు. బ్రష్‌లు కూడా సరిగ్గా లేవు.
రాకేష్ చౌదరి : అవును ఇది ఒక నెల టెండర్ కదా. గతంలో నాలుగు నెలల టెండర్ అప్పుడు ఉన్నారు. ఇది ఈఈ నోటీసులో ఉంది తెలుసా. ఆల్రెడీ ఈఈ సంతకం పెట్టాడు. నువ్వు ఇన్‌చార్జి ఏఈనా.. పర్మినెంట్ ఏఈనా? నోటీసులో ఇన్‌చార్జి అని రాయాలి. ఐఎన్‌సీ అని ఉండాలి కదా. పెట్టలేదు ఏంటి?
ఏఈ: మీరు కార్యాలయానికి రండి!
రాకేష్ చౌదరి : నేను ఆఫీసుకు రావడం ఏమిటి? అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు.
ఏఈ : నువ్వు అని మాట్లాడతావేంటి. ఫస్ట్ ఆఫీసుకు రా అని గద్దించడంతో ఫోన్ కట్ చేశారు.
వెంటనే రాజరాజేశ్వరికి చెందిన కంపెనీ ప్రతినిధి సదరు ఇన్‌చార్జి ఏఈకి ఫోన్ చేసి.. మీ పరిధిలోని రెండు వాహనాలను ఆపేస్తున్నాం. ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతామంటూ పేర్కొన్నారు.
ఇదీ గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో స్వీపింగ్ యంత్రాల కాంట్రాక్టర్‌గా ఉన్న రాజరాజేశ్వరి సంస్థకు చెందిన రాకేష్ చౌదరి వ్యవహరిస్తున్న తీరు.
రిజిస్ట్రేషన్ చేయకుండానే..!
వాస్తవానికి రూ.41 కోట్లు వెచ్చించి 125 స్వీపింగ్ వాహనాలను శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్‌పైజెస్ అనే సంస్థ ద్వారా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ 2017లో కొనుగోలు చేసింది. ఈ వాహనాలను రాష్ట్రంలోని వివిధ మునిసిపాలిటీలకు ఆ సంస్థ సరఫరా చేసింది. ఇందులో 62 వాహనాలు ఆయా మునిసిపాలిటీల పేరిట ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కాలేదు. అయినా ఆ సంస్థకు అప్పట్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ బిల్లులు చెల్లించింది. ఇప్పుడు సగానికిపైగా వాహనాలకు కనీసం ఇంజన్ కూడా లేదు. ఇటువంటి వాహనాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు రవాణాశాఖ అధికారులు అంగీకరించే అవకాశం లేదని మునిసిపాలిటీ శాఖ సిబ్బంది వాపోతున్నారు.
ఒకదాని పరికరాలు
మరొక దానికి...!
సాధారణంగా ఏదైనా వాహనంలో ఒక పరికరం పాడైతే మరో పరికరాన్ని అమర్చి బాగు చేయాల్సి ఉంటుంది. అయితే మరో స్వీపింగ్ వాహనానికి చెందిన పరికరాన్ని పాడైన వాహనానికి అమర్చి.. మొత్తం వాహనాలను డొల్ల కింద మార్చేశారు. ఈ నేపథ్యంలోనే అనేక వాహనాల్లో ఏకంగా ఇంజిన్లు, బ్లోయర్లు, రేడియేటర్లు లాంటి ముఖ్యమైన సామగ్రి అంతా మాయమై తుక్కుకింద మూలకు చేరాయి. తాజాగా విశాఖలో సదరు సంస్థ స్వీపింగ్ యంత్రాలను కూడా అదే విధంగా తుక్కు కింద మార్చుతున్నట్టు ఆరోపణలున్నాయి.
ఆయిల్ సొమ్ము జేబుల్లోకి..
ప్రతీ రోజూ ఒక్కో స్వీపింగ్ యంత్రం 8 గంటల పాటు తిరిగేందుకు రూ.3,500 విలువైన ఆయిల్‌ను వాడాల్సి ఉంటుంది. సదరు సంస్థ మాత్రం రూ.1,500 మేర వాడుతూ.. మిగిలిన రూ.2 వేలు జేబుల్లోకి వేసుకుంటుందనే విమర్శలున్నాయి. ఇక ప్రతీ యంత్రం వద్ద ఒక హెల్పర్‌ను నియమించాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం నియమించకుండా ఆ జీతాలను కూడా సంస్థ జేబుల్లోకి నింపుకుంటున్నట్టు విమర్శలున్నాయి. అటువంటి సంస్థకు జీవీఎంసీ మెకానికల్ విభాగం అధికారులు కొమ్ముకాస్తుండటం వెనుక భారీ వ్యవహారాలు సాగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నాకే నోటీసులు ఇస్తావా?


