ప్రైవేటీకరణ చేస్తే పేదలకు వైద్యం దూరం
కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన
డాబాగార్డెన్స్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి నేతృత్వంలో గురువారం విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద ఈ కార్యక్రమం చేపట్టగా, విద్యార్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. మాజీ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్, పార్టీ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, మహిళా విభాగం, అనుంబంధ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల అనుబంధ బోధన ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందదని, రోగనిర్ధారణ, ఇన్‌పేషెంట్, మందులకు చార్జీలు వసూలు చేస్తారన్నారు. అంతేకాకుండా రాష్ట్ర యువత పెద్ద సంఖ్యలో మెడికల్ సీట్లు కోల్పో తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే తైనాల మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. ఇప్పటికే 7 కాలేజీల నిర్మాణం పూర్తి కాగా, ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. పేడాడ రమణికుమారి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలను చిన్నచూపు చూస్తోందన్నారు. పీపీపీ పేరిట ప్రైవేటీకరణపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, నిర్మాణంలో ఉన్న కాలేజీలను పూర్తి చేసి ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి పేరు వస్తుందనే అక్కసుతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, కార్పొరేటర్లు శశికళ, బిపిన్‌కుమార్ జైన్, పార్టీ జిల్లాఅధికార ప్రతినిధి దొడ్డి రామానంద్, సనపల రవీంద్ర భరత్, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రైవేటీకరణ చేస్తే పేదలకు వైద్యం దూరం


