విశాఖను వ్యాపారానికి కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ఎంవీపీకాలనీ: విశాఖను వ్యాపార రంగానికి కేంద్రంగా నిలుపుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానికి సత్యప్రసాద్ పేర్కొన్నారు. నెరెడ్కో ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా నిర్వహిస్తున్న ‘నెరెడ్కో వైజాగ్ ప్రోపర్టీ ఫెస్ట్–2025’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో కలిసి ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటి ఆఫ్ డెస్టినీగా ప్రసిద్ధి చెందిన విశాఖను పెట్టుబడులకు డెస్టినీగా కూడా నిలుపుతామన్నారు. విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయన్న ఆయన రానున్న రోజుల్లో విశాఖ గేట్ వే ఆఫ్ బిజినెస్‌గా నిలుస్తుందన్నారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ విశాఖ అభివృద్ధిలో రాష్ట్ర వ్యాపారులంతా భాగస్వాములుగా నిలవాలన్నారు. విశాఖకు కమర్షియల్ ఎస్టాబ్లిస్‌మెంట్ అవసరమన్న ఆయన వాణిజ్య సముదాయాలు, వ్యాపార వర్గాల కార్యాలయాలు, స్టార్ హోటళ్లు మరిన్ని రావాల్సి ఉందన్నారు. నెరెడ్కో జాతీయ అధ్యక్షుడు హరిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు చక్రధర్, విశాఖ అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ వ్యాపారాభివృద్ధికి నెరెడ్కో అందిస్తున్న సేవలను వివరించారు. విశాఖ పెట్టుబడులకు అనుకూలంగా నిలుస్తోందన్నారు. ఇలాంటి ప్రోపర్టీ షోల ద్వారా వ్యాపారాభివృద్ధికి చేస్తున్న కృషి వివరించారు. అనంతరం అతిథులు విశాఖలోని పలువురు వ్యాపార ప్రముఖులను సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గౌతు శిరీష, విష్ణుకుమార్‌రాజు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ తేజ్ భరత్, నెరెడ్కో ప్రతినిధులు చోడే పట్టాభిరామ్, వెంకన్న చౌదరి, సుబ్బారావు పాల్గొన్నారు.


