రిజిస్ట్రేషన్ చేసుకోండి.. సదస్సుకు వెళ్లండి..!
పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలు కరువు రిజిస్టర్ చేసుకోవాలనిఏయూ విద్యార్థులకు పిలుపు నేడు ఏపీ పెవిలియన్ హాల్–5లో గీతం విద్యార్థులే.. ఇప్పటికే వందల పాస్‌ల అందజేత
సాక్షి, విశాఖపట్నం : ఎటు చూసినా ఖాళీ కుర్చీలతో భాగస్వామ్య సదస్సు వెలవెలబోతోంది. తొలిరోజు ఏయూ, గీతం విద్యార్థులను తీసుకొచ్చినా.. వారు గంటసేపు కూడా హాల్‌లో ఉండకపోవడంతో ప్రధాన వేదిక బోసిపోయింది. రెండో రోజూ అదే మాదిరిగా దర్శనమిస్తే.. పరువుపోతుందనీ దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటూ చంద్రబాబు, లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పారిశ్రామికవేత్తలను ఇప్పటికిప్పుడు తీసుకురావడం కష్టమని భావించిన అధికారులు.. విద్యార్థుల్నే నమ్ముకున్నారు. ఏయూ విద్యార్థులను తీసుకురావాలని నిర్ణయించారు. విద్యార్థులతో పాటు అధ్యాపకులు, ఇతర స్టాఫ్ ఎవరైనా సదస్సుకు వెళ్లాలని అనుకుంటే.. గురువారం రాత్రి 8 గంటల్లోగా పేర్లు హెచ్‌వోడీకి ఇవ్వాలంటూ ఏయూ విద్యార్థులు, అధ్యాపకుల సోషల్ మీడియా గ్రూపుల్లో మెసేజ్ చేశారు. ఎంతో ప్రచార ఆర్భాటం చేసిన సదస్సులో కుర్చీలు నింపేందుకు మనల్ని రమ్మని చెప్పడం సిగ్గు చేటుగా ఉందంటూ విద్యార్థులు చర్చించుకున్నారు.
నేడు ప్రధాన వేదిక మొత్తం గీతం విద్యార్థులే.!
భాగస్వామ్య సదస్సులో ప్రధాన వేదికగా చెప్పుకుంటున్న ఏపీ పెవిలియన్ హాల్–5 నిండే పరిస్థితులు కనిపించడం లేదు. ఓవైపు.. ఏయూ విద్యార్థులకు బంపర్ ఆఫర్ అంటూ రిజిస్ట్రేషన్‌లకు అవకాశం కల్పించినా.. ఆశించిన స్థాయిలో వస్తారో రారో అని భయం చంద్రబాబు ప్రభుత్వానికి పట్టుకుంది. అందుకే తమ బంధువుకి చెందిన గీతం వర్సిటీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదిక హాల్–5లోకి ప్రవేశం కల్పిస్తూ గీతంకి చెందిన వందల మంది విద్యార్థులకు యాక్సెస్ పాస్‌లు గురువారం రాత్రి పంపిణీ చేశారు. గీతం విద్యార్థులతో ప్రధాన వేదిక నింపేసి.. మిగిలిన సెషన్ల హాళ్లలో ఏయూ విద్యార్థులతో నింపేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు, అనేక దేశాల నుంచి వాణిజ్య ప్రతినిధులు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది పారిశ్రామికవేత్తలు విశాఖకు తరలివస్తున్నారంటూ ఊదరగొట్టిన చంద్రబాబు సర్కారు.. చివరికి విద్యార్థుల్నే డెలిగేట్స్‌గా చూపించి.. పబ్బం గడిపేసుకునేందుకు సిద్ధమవుతుండటం కొసమెరుపు.


