వాహనదారులకు చుక్కలు
విశాఖ సిటీ: విశాఖ వాసులను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇటీవల కాలంలో తలెత్తుతున్నాయి. నగరంలో ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా ఆ ప్రభావం బీచ్ రోడ్డు, జాతీయ రహదారిపై పడుతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోతున్నాయి. తాజాగా సీఐఐ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు మరోసారి నగరవాసుల సహనానికి పరీక్ష పెట్టింది. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మరోవైపు పారిశ్రామికవేత్తలు రాకపోకల సమయంలో ట్రాఫిక్‌ను ఎక్కడిక్కడ నిలిపివేశారు. దీంతో ఉదయం, సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆయా రహదారుల్లో సాధారణ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
స్తంభించిన ట్రాఫిక్: వీఐపీలు, పారిశ్రామికవేత్తలకు నగరంలో స్టార్‌హోటళ్లలో బస ఏర్పాట్లు చేశారు. వీరు ఉదయం హోటళ్ల నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానానికి వచ్చే సమయంలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అలాగే సాయంత్రం కూడా సదస్సు ముగిసిన తర్వాత వీరు బస చేసిన హోటళ్లకు వెళ్లే సమయంలో కూడా సాధారణ వాహనాలను ఆ రహదారుల్లో అనుమతించలేదు. దీంతో ప్రజలు నరకం చూశారు. ప్రధానంగా బీచ్ రోడ్డులో బారికేడ్లు పెట్టి వాహనాలను నిలిపివేయడంతో అటువైపు ప్రయాణించే వాహనదారులు జాతీయ రహదారి వైపు మళ్లారు. దీంతో బీచ్ రోడ్డులోను, జాతీయ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు తలెత్తాయి. జాతీయ రహదారి మద్దిలపాలెం నుంచి హనుమంత వాక జంక్షన్ వరకు ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. అలాగే బీచ్ రోడ్డులో నోవాటెల్ హోటల్ నుంచి రాడిసన్ బ్లూ మధ్య అనేక సార్లు వాహనాలను నిలిపివేశారు. ప్రధానంగా బీచ్ రోడ్డులో నివాసితులు ప్రత్యక్ష నరకం చూశారు. సాధారణంగా 30 నిమిషాలు పట్టే ప్రయాణం.. శుక్రవారం మాత్రం గంటన్నర, రెండు గంటలు పట్టింది.


