సమ్మిట్‌కు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు
అల్లిపురం: సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌ను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి గురువారం పరిశీలించారు. సమ్మిట్‌కు సుమారు 2,300 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సదస్సు ప్రాంగణంతో పాటు, నగరంలో ముఖ్య ప్రాంతాలన్నీ డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాలు, ఇతర సాంకేతిక చర్యలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరానికి విచ్చేయనున్న దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, ప్రముఖుల కోసం ఇప్పటికే పోలీసు అధికారులు సిబ్బందితో నిరంతర నిఘా ఏర్పాటు చేశారన్నారు. నగరంలోని అన్ని హోటళ్లు, లాడ్జిలు, రిసార్టులు, గెస్ట్ హౌస్‌ల్లో పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో ముఖ్యమైన ప్రాంతాలలో పికెట్స్, గార్డులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. నగరంలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అస్త్రం యాప్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు.


