సైలెంట్‌ కిల్లర్‌ షుగర్‌ | - | Sakshi
Sakshi News home page

సైలెంట్‌ కిల్లర్‌ షుగర్‌

Nov 14 2025 5:48 AM | Updated on Nov 14 2025 5:48 AM

సైలెం

సైలెంట్‌ కిల్లర్‌ షుగర్‌

● అదుపు తప్పితే పెను ముప్పు ● జీవన శైలిలో మార్పుతో ఆరోగ్యకర సమాజం ● నేడు ప్రపంచ మధుమేహ దినోత్సవం

మహారాణిపేట: విశాఖలో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మనుషుల జీవన శైలిలో మార్పుల వల్ల ఈ వ్యాధి తీవ్రత అధికమవుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. విశాఖ జిల్లాతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి, అలాగే పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా రోగులు చికిత్స కోసం విశాఖ వస్తున్నారు. కేజీహెచ్‌తోపాటు ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో చక్కెర వ్యాధికి చికిత్స అందిస్తున్నారు. ఒక్క కేజీహెచ్‌ ఓపీకే ప్రతి రోజు 150 నుంచి 200 మంది వస్తుంటారు. ఇక్కడ ప్రతి రోజు మధుమేహం వ్యాధి సంబంధించిన ఓపీ ఉంటుంది.

ప్రస్తుతం మధుమేహం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. దేశంలో కోట్లాది మంది మధుమేహంతో బాధపడుతుండగా, ఇంకా చాలామందికి ఈ వ్యాధి ఉన్న సంగతి కూడా తెలియకపోవడం ఆందోళన కలిగించే విషయం. దీని లక్షణాలు తీవ్రమైన సమస్యలు వచ్చే వరకు బయటపడవు కాబట్టి.. దీనిని సైలెంట్‌ కిల్లర్‌ అని పిలుస్తారు. నియంత్రణలో లేకపోతే మధుమేహం గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, చూపు తగ్గడం, నరాల బలహీనత వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. ఏటా నవంబర్‌ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం నిర్వహిస్తారు. మధుమేహ రోగులకు ప్రాణదాత అయిన ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన సర్‌ ఫ్రెడ్రిక్‌ బాంటింగ్‌ జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ‘జీవితంలోని ప్రతి దశలో మధుమేహ నియంత్రణ’అనే అంశంతో అవగాహన కల్పిస్తున్నారు.

అవగాహనే నివారణకు తొలి మెట్టు

మధుమేహం రకాల్లో టైప్‌–2 మధుమేహం అత్యంత సాధారణం. దీనిని జీవనశైలి మార్పులతోనే నివారించవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు వంటి అధిక ఫైబర్‌ కలిగిన ఆహారాలను తీసుకోవాలి. చక్కెర పానీయాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, డీప్‌ ఫ్రైడ్‌ స్నాక్స్‌కు దూరంగా ఉండాలి. రోజూ కనీసం 30 నిమిషాల వేగంగా నడక, సైక్లింగ్‌ లేదా ఏదైనా శారీరక వ్యాయామం చేయడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అధిక బరువు మధుమేహానికి ప్రధాన ప్రమాద కారకంగా వైద్యులు చెబుతున్నారు. ధూమపానం, మద్యం సేవించడం మధుమేహం ప్రమాదాన్ని పెంచుతాయి.

కుటుంబం, సమాజం పాత్ర కీలకం

మధుమేహాన్ని ముందుగానే గుర్తించడం ద్వారా నియంత్రణ సులభమవుతుంది. మందులు లేదా ఇన్సులిన్‌ను క్రమంగా తీసుకోవడం, రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం, క్రమం తప్పకుండా వైద్యుడిని కలవడం ద్వారా ఆరోగ్యంగా, చురుకుగా ఉండవచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వారికి కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, సమాజం అందించే మద్దతు ఎంతో అవసరం. పాఠశాలలు, కార్యాలయాలలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, అవగాహన కార్యక్రమాలు, స్క్రీనింగ్‌ డ్రైవ్‌లు కొనసాగించడం ద్వారా మధుమేహ నియంత్రణకు దోహదం చేయవచ్చు.

అన్ని వయసులపైనా ప్రభావం

మధుమేహం ఏ వయసు వారినైనా ప్రభావితం చేయవచ్చు. ప్రతి దశలోనూ ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.

పిల్లల్లో.. తరచూ దాహం వేయడం, ఎక్కువగా మూత్రం పోవడం, కారణం లేకుండా బరువు తగ్గడం, అలసట, పాఠశాలలో ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించాలి.

యవ్వనంలో.. జంక్‌ ఫుడ్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌, మొబైల్‌తో ఎక్కువ సమయం గడపడం, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం వల్ల ప్రమాదం పెరుగుతోంది.

యువతీ యువకుల్లో.. ఒత్తిడి, సక్రమంగా లేని పని గంటలు, కూర్చొని చేసే ఉద్యోగాలు, రాత్రిళ్లు జాగారం, రెగ్యులర్‌ మీల్స్‌ లేకపోవడం వంటివి ఇన్సులిన్‌పై ప్రభావం చూపి షుగర్‌ పెరిగేలా చేస్తాయి.

గర్భకాలంలో.. గర్భధారణలో షుగర్‌ వల్ల తల్లి, శిశువు ఇద్దరికీ ప్రమాదం ఉంటుంది. తల్లికి భవిష్యత్తులో టైప్‌–2 డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గర్భిణులు షుగర్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరిగా చేయించాలి.

వృద్ధుల్లో.. పెద్దవారిలో హృద్రోగం, కిడ్నీ, కళ్ల సమస్యలు త్వరగా వస్తాయి. షుగర్‌ ఒక్కసారిగా పడిపోవడం లేదా పెరగడం జరగవచ్చు. వీరికి పాద సంరక్షణ చాలా ముఖ్యం.

నిర్లక్ష్యం వద్దు.. నియంత్రణ ముఖ్యం

మధుమేహం పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. కేజీహెచ్‌కు వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం. దేశంలో 12 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ ప్రాబల్యం పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. చక్కెర వ్యాధి పట్ల నిర్లక్ష్యం వద్దు. తప్పనిసరిగా మందులు వాడడం, ఆహారపు అలవాట్లు నియంత్రణలో ఉండాలి. వ్యాయామం చేయడం ద్వారా చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. ఒత్తిడి వల్ల కూడా ఈ వ్యాధి సోకుతోంది.

– డాక్టర్‌ కె.ఎ.వి.సుబ్రహ్మణ్యం,

ఎండోక్రైనాలజీ విభాగాధిపతి, కేజీహెచ్‌

సైలెంట్‌ కిల్లర్‌ షుగర్‌1
1/1

సైలెంట్‌ కిల్లర్‌ షుగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement