స్నేహం ముసుగులో మోసం
కిడ్నీ విక్రయ ఘటనలో మృతి చెందిన
యువతికి నేడు అంత్యక్రియలు
తగరపువలస: స్నేహం పేరుతో మోసగించి, బలవంతంగా కిడ్నీని విక్రయించిన కారణంగా మరణించిన సాడి యమున(29) భౌతిక కాయానికి శుక్రవారం ఆమె స్వగ్రామం వెల్లంకిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలేనికి చెందిన యమునను.. నగరానికి చెందిన సూరిబాబు, పద్మ, సత్య అనే వ్యక్తులు పిక్నిక్ పేరుతో వంచించి, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెకు తీసుకువెళ్లారు. అక్కడ ఆమె కిడ్నీని విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ చర్యల కారణంగా తీవ్ర అనారోగ్యం పాలైన యమున చివరకు మృతి చెందింది. మరణించిన మూడు రోజుల అనంతరం గురువారం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో యమున మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం మృతురాలి తల్లిదండ్రులు సూరమ్మ, నరసింహులు, తమ్ముడు నాగేంద్రతో పాటు వెల్లంకి ఎంపీటీసీ సభ్యుడు తోణంగి అప్పారావు రెడ్డి తదితరులు యమున మృతదేహాన్ని స్వగ్రామం వెల్లంకికి తీసుకొస్తున్నారు. శుక్రవారం ఉదయం వెల్లంకిలో ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.


