చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం
స్విమ్మింగ్ పూల్‌లో పడి ఒకటో తరగతి విద్యార్థి మృతి
డావెన్సీ అంతర్జాతీయ స్కూల్
యాజమాన్యం తీరుపై నిరసన
స్కూల్ డైరెక్టర్ రమణాజీ జనసేన నేత
మునగపాక: తిమ్మరాజుపేటలోని డావెన్సీ అంతర్జాతీయ పాఠశాలలో గురువారం విషాదం చోటు చేసుకుంది. యలమంచిలి ధర్మవరం ప్రాంతానికి చెందిన ఒకటో తరగతి చదువుతున్న మోక్షిత్ సందీప్ (8) అనే విద్యార్థి స్కూల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందాడు. ఇది పూర్తిగా పాఠ శాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మధ్యా హ్నం సందీప్ స్కూల్‌లోని స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. తరగతులు అయ్యాక స్కూలు బస్సు ఎక్కిన అతని అన్నయ్య ప్రశాంత్(6వ తరగతి) కొంత దూరం వెళ్లాక తమ్ముడు సందీప్ రాలేదని గుర్తించాడు. కంగారు పడి వెంటనే ఆ విషయం చెప్పినా బస్సు డ్రైవర్ పట్టించుకోలేదు. ధర్మవరానికి బస్సును తీసుకువచ్చేశాడు. ఇంటికి వెళ్లిన ప్రశాంత్ తన తల్లితో తమ్ముడు సందీప్ బస్సులో రాలేదని చెప్పడంతో కంగారుపడ్డ శ్రీలత స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేశారు. ఎంతకూ స్పందించకపోవడంతో తన బంధువులతో కలిసి స్కూల్‌కు వచ్చి సందీప్ కోసం వెతకడం ప్రారంభించారు. స్కూల్ ఆవరణలోని స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవిగా కనిపించాడు. యాజమాన్యంపై, స్విమ్మింగ్ శిక్షకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, బాధిత కుటుంబ సభ్యులు స్కూల్ ఎదుట పూడిమడక రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్‌గా జనసేన నేత జెర్రిపోతుల రమణాజీ వ్యవహరిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే యాజమాన్యం స్పందించకపోవడం, అందుబాటులో లేకపోవడంపై బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ తండ్రి జనపరెడ్డి శ్రీనివాసరావు జమ్మూలో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. చిన్నారులందరూ బాలల దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది.
చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం


