అక్షయపాత్రను సందర్శించిన యువ పారిశ్రామికవేత్తలు
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరంలోని అక్షయపాత్ర వంటశాలను గురువారం జాగృతి యాత్ర పేరుతో సుమారు 580 మంది యువ పారిశ్రామిక వేత్తలు సందర్శించారు. ఈ నెల 8న ముంబైలో 18 బోగీలతో కూడిన ప్రత్యేక రైలులో బయలుదేరిన వీరు దేశంలో 12 మహానగరాలను సందర్శించి అక్కడ ప్రముఖ సంస్థల కార్యకలాపాల గురించి అధ్యయనం చేయనున్నారు. అందులో భాగంగా అక్షయపాత్ర వంటశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అక్షయపాత్ర హెడ్ విశ్వాస్, హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస వివరాలు తెలియజేశారు. ఆదునిక యంత్రాలతో ఒకేసారి వేలాది మందికి వంట చేసే విధానం గురించి వివరించారు. 24 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులకు 75 వంటశాలల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో మధ్యాహ్నం భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జాగృతి యాత్ర ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశుతోష్ కుమార్, కో ఆర్డినేటర్ నిముష మాట్లాడుతూ శుక్రవారం నుంచి ఒడిశాలో యాత్ర సాగుతుందన్నారు. యువతీ యువకులు పారిశ్రామిక వేత్తలుగా తయారు కావడానికి అవసరమైన సహాయం ఈ యాత్రలో అందుతుందన్నారు. ఈ జాగృతి యాత్ర 15 ఏళ్ల నుంచి జరుగుతుండగా వరుసగా 10వ సారి అక్షయపాత్ర వంటశాలను సందర్శించిందన్నారు. ఈ సందర్భంగా యువ పారిశ్రామికవేత్తలు జట్ల వారీగా కిచెన్‌లోకి వెళ్లి ఆహార పదార్థాలు తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ జనరల్ మేనేజర్ అంబరీష దాస, వంటశాల ఆపరేషన్ మేనేజర్ కె.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.


