టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విజేత గుజరాత్
ఎంవీపీకాలనీ: 40వ ఆలిండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ క్రీడాపోటీలు 4వ రోజు హోరాహోరీగా సాగాయి. ఎంవీపీ కాలనీలోని ఎస్–3 స్పోర్ట్స్ ఏరీనా వేదికగా ఈ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆలిండియా పోటీల్లో దేశంలోని 14 తపాలా సర్కిళ్లకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన 129 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషులు, మహిళ విభాగంలో క్రీడాకారులు పోటీ జరుగుతుండగా 4వ రోజు పోటీలు వివిధ సర్కిళ్ల క్రీడాకారుల మధ్య ఉత్కంఠగా సాగాయి. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్స్‌లో గుజరాత్ జట్టు పశ్చిమ బెంగాల్ జట్టుపై (3–2) తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచింది. దీంతో పాటు పురుషుల డబుల్స్ ఫైనల్‌లో పశ్చిమ బెంగాల్ జట్టు తెలంగాణ జట్టుపై (3–0) తేడాతో విజయం సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్స్‌లో పశ్చిమబెంగాల్ జట్టు ఆంధ్రప్రదేశ్ జట్టుపై (3–1) తేడాతో విజయం సాధించి విజేతగా నిలిచింది. 14వ తేదీన మరిన్ని జట్లు మధ్య ఫైనల్స్ నిర్వహించడంతో పాటు ముగింపు కార్యక్రమంలో మెడల్స్ అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


