ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలి
పోర్ట్‌లో ముగిసిన నిఘా అవగాహన వారోత్సవాలు
విశాఖ సిటీ: ఉద్యోగులు అంకితభావంతో పనిచేయడం ద్వారా పోర్టు, డీసీఐఎల్ సంస్థలు మరింత ఉన్నతస్థాయికి ఎదుగుతాయని పోర్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తు పేర్కొన్నారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో నిఘా అవగాహన వారోత్సవాలు–2025 గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు చేపట్టిన చర్యలు రేపటి వ్యక్తి, సంస్థ భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. పోర్ట్ ముఖ్య నిఘా అధికారి టి.అరుణ్ ప్రసాద్ నిఘా అవగాహన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్, ఇతర పోటీల్లో విజేతలైన విద్యార్థులు, ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పోర్ట్ డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్ కుమార్ దూబే, సెక్రటరీ టి.వేణు గోపాల్, డీసీఐఎల్ ఎండీ, సీఈవో కెప్టెన్ ఎస్.దివాకర్(అడిషనల్ చార్జ్), ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


