తెరుచుకున్న పటేల్ వంతెన
సింధియా మీదుగా నగరానికి(వన్ వే) దారి సుగమం
7 కి.మీ.దూరం తగ్గడంతో
వాహనదారుల హర్షం
పూర్తిస్థాయి రాకపోకలకు
మరో ఆరు నెలల సమయం
మల్కాపురం: పారిశ్రామిక ప్రాంత వాసుల 18 నెలల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. డాక్‌యార్డ్ వద్ద గల సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెనపై మంగళవారం అర్ధరాత్రి నుంచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రభుత్వ విప్ పి.గణబాబు ఈ ఒకవైపు మార్గాన్ని ప్రారంభించారు. ప్రస్తుతానికి కేవలం సింధియా వైపు నుంచి నగరానికి (వన్ వే) వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నిర్ణయంతో పారిశ్రామిక ప్రాంతం నుంచి నగరానికి వెళ్లే వాహనదారులు సుమారు 7 కిలోమీటర్ల అదనపు ప్రయాణ భారం నుంచి ఉపశమనం పొందారు. దీంతో పలువురు వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
18 నెలల అవస్థలు
దాదాపు 50 ఏళ్లకు పైగా సేవలందించిన ఈ వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో.. 18 నెలల కిందట ఈ వంతెనపై నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో పారిశ్రామిక ప్రాంత వాసులు, భారీ వాహనాలు నగరానికి చేరుకోవడానికి వీడీఆర్ గోడౌన్స్, మారుతి సర్కిల్ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ఇది అదనంగా 7 కిలోమీటర్ల భారం కావడమే కాకుండా, ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు, తరచూ ప్రమాదాలకు కారణమైంది. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డారు. వాహదారుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో, అధికారులు, పాలకులు స్పందించి.. ఒకవైపు మార్గాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతానికి వన్ వే మాత్రమే..
సింధియా నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెనపై నుంచి ప్రయాణించి నగరంలోకి ప్రవేశించవచ్చు. నగరం నుంచి పారిశ్రామిక ప్రాంతం వైపు వచ్చే వాహనాలకు ఇంకా పాత మార్గమే కొనసాగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన దిగువన, ఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ వద్ద కాన్వెంట్ జంక్షన్ నుంచి ప్రధాన వంతెనను కలిపే పనులు ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి, నగరం నుంచి వచ్చే వాహనాలు తప్పనిసరిగా మారుతీ సర్కిల్ మీదుగా, వీడీఆర్ గోడౌన్స్‌ను దాటుకుని డాక్‌యార్డ్ వైపు రావాల్సి ఉంటుంది. లేదా మారుతీ సర్కిల్ నుంచి శ్రావణ్ షిప్పింగ్ మీదుగా ములగాడ గ్రామం గుండా ప్రయాణించాలి. వంతెనను రెండు వైపులా వినియోగంలోకి తీసుకురావడానికి మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ వంతెన చరిత్ర
విశాఖ పోర్టు అధికారులు 1973లో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెనను నిర్మించారు. అంతకుముందు (సుమారు 60 ఏళ్ల కిందట) పోర్టు నుంచి గాజువాక, మల్కాపురం, అనకాపల్లి వంటి ప్రాంతాలకు సరకులను ఎడ్ల బండ్లు, ఇతర వాహనాల ద్వారా తీసుకొచ్చేవారు. షిప్‌యార్డ్ డీడీ ఎస్‌ఆర్ వద్ద గల ఫెర్రీ మార్గం ఉండేది. ఈ మార్గం ద్వారా ఎడ్ల బండ్లు, ఇతర వాహనాలు, నగరానికి పనిమీద వెళ్లే వారు రాకపోకలు సాగించేవారు. అయితే పోర్టుకు కార్గో నౌకలు, యుద్ధ నౌకలు వచ్చే సమయాల్లో ఈ ఫెర్రీ ప్రయాణానికి తీవ్ర అంతరాయం కలిగేది. 1973కు ముందు గూడ్స్ రైలు, ఇతర వాహనాల కోసం ఒక పాత వంతెన ఉండేది. కానీ దానిపై గూడ్స్ రైలు వెళ్లేటప్పుడు వాహనాలను నిలిపివేయాల్సి రావడం ఇబ్బందిగా మారింది. ఈ అన్ని సమస్యలకు పరిష్కారంగా 1973లో సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెనను నిర్మించారు. దీంతో పాత వంతెన కేవలం గూడ్స్ రైలుకు పరిమితం కాగా పటేల్ వంతెన వాహనాల రాకపోకలకు ప్రధాన మార్గంగా మారింది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన


