భాగస్వామ్య సదస్సుకు సర్వ సన్నద్ధం
దేశ, విదేశాల నుంచి పలు సంస్థల ప్రతినిధుల హాజరు సదస్సు వేదికగా సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ చేతుల మీదుగా 14న సదస్సు ప్రారంభం
విశాఖ సిటీ: సీఐఐ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సుకు విశాఖ సన్నద్ధమైంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో 14, 15 తేదీల్లో సమ్మిట్‌కు అధికార యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్–ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్–2047’ థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 100కి పైగా విదేశీ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 30కి పైగా అవగాహన ఒప్పందాలు జరగనున్నట్లు భావిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వేదిక నుంచి వివరించనున్నారు. అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రధాన థీమ్ సెషన్లు నిర్వహించనున్నారు. వీటితో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
నేడు సీఎం వరుస సమావేశాలు
సీఎం చంద్రబాబు గురువారం నోవోటెల్ హోటల్‌లో పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్–ఇండియా–యూరప్ కోఆపరేషన్ ఫర్ సస్టెయినబుల్ గ్రోత్’ అంశంపై జరిగే ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. గ్రీన్ షిఫ్ట్, సస్టయినబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో భేటీ అవుతారు. ఎస్‌పీపీ పంప్స్ లిమిటెడ్, రెన్యూ పవర్, బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్, మురుగప్ప గ్రూప్, జూల్ గ్రూప్, హీరో ఫ్యూచర్ ఇంజినీర్స్ ప్రతినిధులతో సమావేశమై చర్చిస్తారు. సాయంత్రం ‘వైజాగ్ ఎకనమిక్ రీజియన్’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ‘స్పెషల్ మీటింగ్ ఆఫ్ సీఐఐ నేషనల్ కౌన్సిల్’కు హాజరవుతారు.
ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా
సదస్సు ప్రారంభం
సదస్సును శుక్రవారం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. యూసుఫ్ అలీ, బాబా కల్యాణి, కరణ్ అదానీలు విశిష్ట అతిథులుగా హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమం తర్వాత ‘టెక్నాలజీ, ట్రస్ట్, ట్రైడ్’ సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం జరిగే ‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆర్టిఫీషియల్ ఇంటిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఏ విధంగా దోహద పడుతుందో సీఎం తన ప్రసంగంలో వివరిస్తారు. సింగపూర్ నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు నడిపేలా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రతినిధులతో ఒప్పందం చేసుకుంటుంది. సాయంత్రం రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహించే ‘రీఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్’లో సీఎం పాల్గొంటారు. సంజీవ్ గోయింకా గ్రూప్ వైస్ చైర్మన్‌తో సమావేశమై అనంతరం విశాఖలో లులూ నిర్మించే నూతన మాల్‌కు శంకుస్థాపన చేస్తారు. రాత్రికి వివిధ కంపెనీలు ప్రభుత్వ ప్రతినిధులు, ఆహ్వానితుల గౌరవార్ధం ఇచ్చే గాలా డిన్నర్‌లో పాల్గొంటారు.
రెండో రోజు సదస్సులో..
సదస్సు రెండో రోజు శనివారం ఉదయం బ్లూమ్‌బెర్గ్ మీడియా ఇంటరాక్షన్‌లో సీఎం పాల్గొంటారు. తర్వాత రేమండ్, శ్రీసిటీ, ఇండోసోల్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే బహ్రెయిన్, న్యూజిలాండ్, కెనడా, జపాన్ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం వరల్డ్ ఎకనమిక్ ఫోరానికి చెందిన ‘సెంటర్ ఫర్ ఫ్రంటయిర్ టెక్నాలజీస్’ను ప్రారంభిస్తారు. అనంతరం గూగుల్ సంస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం ఎంవోయూల మార్పిడి కార్యక్రమం ఉంటుంది. సదస్సు చివరిగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడతారు.


