మేల్ ఫెర్టిలిటీపై చర్చించాం
డాబాగార్డెన్స్: విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన నూతన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నగరంలో సినిమా యూనిట్ సందడి చేసింది. నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ ఈ కథ ప్రస్తుత సమాజానికి అత్యవసరమైనదని అభిప్రాయపడ్డారు. ‘ఈ రోజుల్లో ఫెర్టిలిటీ సెంటర్లు విపరీతంగా పెరిగాయి. ఇన్ఫెర్టిలిటీ సమస్య అంటే సాధారణంగా అమ్మాయిలలోనే లోపం ఉందని, అందుకే మరో పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం ఉంటోంది. కానీ పురుషులలో ఉండే ఫెర్టిలిటీ సమస్యను మొట్టమొదటిసారిగా ఈ సినిమాలో చూపించడం కొత్తగా అనిపించింది.’ అని అన్నారు. ఈ విషయం గురించి మాట్లాడటానికి చాలా మంది ఇబ్బంది పడతారని, ఇతరులు చిన్నచూపు చూస్తారేమో, నవ్వుతారేమో అని భయపడతారని చాందిని అన్నారు. అయితే ఇలాంటి సీరియస్ పాయింట్ చుట్టూ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించడం ద్వారా.. ఈ సమస్యపై అందరూ చర్చించుకునేలా ఒక ప్రయత్నం చేశామన్నారు. సినిమా విడుదలైన తర్వాత ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ తాను సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నా, సినిమాలంటే మక్కువతో వచ్చానని తెలిపారు. గతంలో చేసిన ఒక చిత్రం అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, కొంత విరామం తీసుకుని నటనను మెరుగుపరుచుకున్నానని చెప్పారు. ఒక సున్నితమైన అంశాన్ని తీసుకుని, దానికి వినోదాన్ని జోడించిన చిత్రమిది అని తెలిపారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహించారు.
‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్ర యూనిట్


