ముగిసిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీలు
చిత్తూరు, పాడేరు ఐటీడీఏల సత్తా
కొమ్మాది: జన జాతీయ గౌరవ దివస్–2025లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్(టీసీఆర్‌టీఎం) ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల ముగింపు కార్యక్రమంలో టీసీఆర్‌టీఎం ఈడీ డా.రాణి మందా పాల్గొని, విజేతలకు ట్రోఫీలను అందజేశారు. కబడ్డీ(బాలురు, బాలికలు) పోటీల్లో చిత్తూరు ఐటీడీఏ, వాలీబాల్ (బాలురు) పార్వతీపురం ఐటీడీఏ, వాలీబాల్ (బాలికలు) సీతంపేట ఐటీడీఏ, జావెలిన్ త్రో (బాలురు, బాలికలు) పాడేరు ఐటీడీఏ, ఆర్చరీ (బాలురు)పాడేరు ఐటీడీఏ, ఆర్చరీ (బాలికలు) పోటీల్లో సీతంపేట ఐటీడీఏ విజేతలుగా నిలిచాయి. అలాగే సాంస్కృతిక పోటీల్లోనూ గిరిజన విద్యార్థులు తమ సృజనాత్మకతను చూపించారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో సీతంపేట ఐటీడీఏ ప్రథమ బహుమతిని గెలుచుకుంది. గిరిజన చిత్రలేఖనం పోటీల్లో కేఆర్‌పురం ఐటీడీఏ ప్రతిభ కనబరిచి అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఈడీ డా. రాణి మందా మాట్లాడుతూ గిరిజన యువత క్రీడలు, విద్యతో పాటు సాంస్కృతిక అంశాలలోనూ ముందుండాలని ఆకాంక్షించారు. జన జాతీయ గౌరవ దివస్ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.


