ఉత్సాహంగా ఆలిండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ పోటీలు
ఎంవీపీకాలనీ : 40వ ఆలిండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ క్రీడాపోటీలు సోమవారం విశాఖ వేదికగా ప్రారంభమయ్యాయి. ఎంవీపీ కాలనీలోని ఎస్3 స్పోర్ట్స్ ఏరీనాలో జరుగుతున్న ఈ పోటీలసు ఏపీ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పీపీ శ్రీదేవి, అర్జున అవార్డ్ గ్రహిత నీలంశెట్టి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల మధ్య క్రీడాస్ఫూర్తికి చిహ్నాంగా ఈ పోటీలు నిలవాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల క్రమశిక్షణ, కృషి దేశానికి గర్వకారణంగా నిలుస్తాయన్నారు. తొలుత ఆయా తపాలా సర్కిల్స్‌కు చెందిన వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోటీలను పురస్కరించుకొని పలు పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. విశాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ వీఎస్ జయశంకర్ మాట్లాడుతూ ఈ ఆలిండియా పోటీల్లో దేశంలోని 14 తపాలా సర్కిళ్లకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన 129 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. తొలిరోజు పోటీలో భాగంగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ సర్కిళ్లకు చెందిన పురుషుల జట్లు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సర్కిళ్లకు చెందిన మహిళ జట్లు పోటీ పడ్డాయి. ఈ నెల 14వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో తపాలా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఏపీ టెబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


