ప్రముఖ న్యాయవాది చీమలపాటి శ్రీరామ మూర్తి అస్తమయం
విశాఖ లీగల్ : ప్రముఖ సీనియర్ న్యాయవాది చీమలపాటి శ్రీరామ మూర్తి (94) ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. కొద్ది రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన గత 70 ఏళ్లుగా విశాఖలో న్యాయవాదిగా కొనసాగారు. ఆయన కుటుంబం న్యాయరంగంలోనే కొనసాగుతోంది. పెద్ద కుమారుడు జస్టిస్ రవి చీమలపాటి రాష్ట్ర హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. రెండో కుమారుడు చీమలపాటి శేఖర్ విశాఖలో సీనియర్ న్యాయవాదిగా, కుమార్తె కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నారు.న్యాయస్థానంలో మెళకువలు, కోర్టు సిబ్బందితో మెలగాల్సిన తీరుపై జూనియర్ న్యాయవాదులకు ఆయన నిరంతరం మార్గనిర్దేశం చేసేవారు. శ్రీరామ మూర్తి మృతిపై విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, బార్ కౌన్సిల్ సభ్యులు సహా పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.


