సొసైటీ సొమ్ముతో జల్సా
ఈపీడీసీఎల్ విద్యుత్ ఉద్యోగుల
కోఆపరేటివ్ సొసైటీలో గోల్‌మాల్
ఉద్యోగులు దాచుకున్న డబ్బులతో
డైరెక్టర్ల షికార్లు
సొసైటీ సొమ్ము తీసుకొని
ఏటా విదేశాల్లో విహారం
ఉద్యోగులకు బహుమతుల పేరిట రూ.కోట్లు కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు
సాక్షి, విశాఖపట్నం : నమ్మకంతో దాచుకున్న సొమ్మును భద్రంగా ఉంచాల్సిన వాళ్లే భక్షకులుగా మారుతున్నారు. ఈపీడీసీఎల్ విద్యుత్ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీలో సభ్యులకు తెలియకుండా ఒక్కొక్కరి పేరిట రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కాజేశారనే ఆరోపణలు ఇటీవల వినిపించాయి. ఇప్పుడు మరో పిడుగు లాంటి వార్త సభ్యులను ఆందోళన పరుస్తోంది. విశాఖ సర్కిల్ పరిధి సొసైటీలోని మూడు బ్రాంచిల్లో కొందరు డైరెక్టర్లు దర్జాగా సభ్యుల సొమ్ముకు కుచ్చుటోపీ పెడుతూ జల్సాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మూడు బ్రాంచ్‌ల్లో..
ఈపీడీసీఎల్ విశాఖపట్నం సర్కిల్ పరిధిలో విద్యుత్ ఉద్యోగుల కో–ఆపరేటివ్ సొసైటీకి సంబంధించి విశాఖ సర్కిల్, గాజువాక, సింహాచలం బ్రాంచ్‌లున్నాయి. ఒక్కో బ్రాంచ్ సొసైటీకి అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు ఉద్యోగుల సంఖ్యను బట్టి 7 నుంచి 9 మంది డైరెక్టర్లు ఉంటారు. ఈ సొసైటీలో ఈపీడీసీఎల్ సర్కిళ్లతో పాటు చింతపల్లి, సీలేరులోని జెన్ కో ఉద్యోగులు కూడా సభ్యులుగా ఉన్నారు. ఇందులో డైరెక్టర్లు కొందరు సొసైటీ సభ్యుల సొమ్మును విలాసాలకు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
విహారయాత్రలకీ ఆ సొమ్మేనా.!
ఆయా సొసైటీల్లో ఉన్న కొందరు డైరెక్టర్లు ఏటా వివిధ ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా విహార యాత్రలకు వెళ్తున్నారు. థాయ్‌లాండ్, దుబాయ్, మలేసియా.. ఇలా ఏటా వేర్వేరు ప్రాంతాల్లో స్పెషల్ టూర్లు పేరుతో చక్కర్లు కొడుతున్నారు. అయితే ఈ టూర్లకీ సొసైటీ సొమ్ము వాడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. ముఖ్యంగా సింహాచలం బ్రాంచ్‌లో నలుగురు డైరెక్టర్లు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం విహార యాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఖర్చులను కూడా సొసైటీ ఖర్చుల్లో వివిధ పేర్లు మార్చి చూపించేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా సభ్యులు దీనిపై నిలదీస్తే చాలు.. వారి ఖాతాలపైనా, డివిడెంట్లపైనా ప్రతాపం చూపిస్తుంటారని విమర్శలొస్తున్నాయి. పైగా కొందరు డైరెక్టర్లు ఈపీడీసీఎల్ యూనియన్లలో కీలకంగా ఉన్నారు. దీంతో డైరెక్టర్లు ఏంచేసినా మౌనంగా భరిస్తున్నామని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సరిగా ఆడిట్ నిర్వహిస్తే కొందరు డైరెక్టర్ల బండారాలు బయటపడతాయంటున్నారు.
బహుమతుల పేరుతో స్వాహా!
సొసైటీలో ఉన్న సభ్యులకు ఏటా ఒకసారి బహుమతుల పేరుతో చిన్న ఉత్సవంలా నిర్వహిస్తుంటారు. ఇందులోనూ డైరెక్టర్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం దసరాకు డెవిడెంట్ ఫండ్‌తో ఇస్తుంటారు. ట్రావెలింగ్ బ్యాగ్‌లు, మిక్సీలు, కుక్కర్లు అందజేస్తుంటారు. వీటిని కూడా కొందరికే ఇచ్చి.. మిగిలిన సొమ్మును స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. సొసైటీలో సుమారు 800 మంది సభ్యులుంటే.. 600 మందికి మాత్రమే అందజేసి.. మిగిలినవి తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ ఉద్యోగుల కో–ఆపరేటివ్ సొసైటీలో కొందరు డైరెక్టర్లు
చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సొసైటీ సభ్యుల పేరుతో రుణాలు తీసుకొని ఓ మాజీ డైరెక్టర్
జేబులు నింపేసుకోగా.. మరికొందరు డైరెక్టర్లు సొసైటీ సొమ్ముతో జల్సాలు
చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా సభ్యులకు బహుమతులిచ్చే
నెపంతోనూ సొమ్ములు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.


