సినర్జీస్ కార్మికుల ఆకలి ఘోష
బీచ్‌రోడ్డు: దువ్వాడ వీఎస్‌ఈజెడ్‌లో ఉన్న సినర్జీస్ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 600 మంది కార్మికులకు యాజమాన్యం ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ కార్మికులు తమ కుటుంబాలతో కలిసి సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. బకాయిపడ్డ జీతాలను వెంటనే చెల్లించాలని, బోనస్ ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సక్రమంగా జమ చేయాలని, అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు యాజమాన్యం మొండివైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్‌వీ కుమార్ మాట్లాడుతూ కార్మికులు 20 ఏళ్ల నుంచి సినర్జీ సంస్థలో పనిచేస్తున్నారని, వారికి చట్టపరంగా రావలసిన హక్కుల్ని యాజమాన్యం అమలు చేయడం లేదని విమర్శించారు. కార్మికుల నుంచి పీఎఫ్, ఈఎస్‌ఐ వసూలు చేస్తున్నప్పటికీ, యాజమాన్యం తమ వాటాను చెల్లించడం లేదని ఆరోపించారు. అంతేకాక తొమ్మిదేళ్లగా బోనస్ కూడా చెల్లించలేదన్నారు. జీతాలు చెల్లిస్తామని జాయింట్ కమిషనర్ అంగీకరించి కూడా న్యాయం జరగలేదన్నారు. జీతాలు అడిగితే ‘చెల్లించలేం, మీకు నచ్చింది చేసుకోండి’ అని యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోందని కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకున్నా యాజమాన్యం జీతాలు చెల్లించలేదన్నారు. ముఖ్యమంత్రి నగరంలో పారిశ్రామిక సమ్మిట్ పేరుతో కొత్త పరిశ్రమలు, వేల ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారని, ఆరు నెలల నుంచి జీతాలు లేక రోడ్డుమీద ఉన్న కార్మికులకు ముందు న్యాయం చేయాలని ఆయన కోరారు. తక్షణమే అధికారులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు దాస్, రాంబాబు, లోకేష్ రాజు, ఐద్వా నాయకులు లక్ష్మీ, కామేశ్వరి సంఘీభావం పాల్గొన్నారు.
కొనసాగుతున్న దీక్షలు
అగనంపూడి : దువ్వాడ వీఎస్‌ఈజెడ్ ఆవరణలోని సినర్జీస్ క్యాస్టింగ్స్ లిమిటెడ్ సంస్థ కార్మికులు తమకు బకాయి పడిన జీతాలు చెల్లించాలని కోరుతూ సోమవారం సంస్థ గేటు వద్ద సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ నిరసనలో యూనియన్ నాయకులు శ్రీనివాస్, దాస్, వెంకటరావు, రమణ పాల్గొన్నారు.
సినర్జీస్ కార్మికుల ఆకలి ఘోష


