బిల్లులు చెల్లించండి మహాప్రభో.. | - | Sakshi
Sakshi News home page

బిల్లులు చెల్లించండి మహాప్రభో..

Nov 11 2025 5:21 AM | Updated on Nov 11 2025 5:21 AM

బిల్లులు చెల్లించండి మహాప్రభో..

బిల్లులు చెల్లించండి మహాప్రభో..

చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా బిల్లుల పెండింగ్‌ లబోదిబోమంటున్న జీవీఎంసీ కాంట్రాక్టర్లు

డాబాగార్డెన్స్‌ : జీవీఎంసీ పరిధిలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు అందక తలలు పట్టుకుంటున్నారు. అప్పులు చేసి మరీ పనులు పూర్తి చేసిన చిన్న కాంట్రాక్టర్లు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల కోసం జీవీఎంసీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం లేకపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధి పోర్టర్‌ను ఏర్పాటు చేసింది. దీని వల్ల కాంట్రాక్టర్లకు పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. పాత బిల్లులు అందులో అప్‌లోడ్‌ కావడం లేదు. గత 13 నెలలుగా సుమారు రూ.400 కోట్లు బకాయిలున్నాయి. ఫలితంగా కాంట్రాక్టర్లందరూ బిల్లుల కోసం రోడ్డెక్కారు. ‘జీవీఎంసీ తమకు సహకరించడం లేదు.. బిల్లులు చెల్లించడం లేదు.. ఆర్థికంగా ఇబ్బందులు పడతున్నాం.. విషయాన్ని పలుమార్లు మేయర్‌, కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి మొరపెట్టుకున్నాం.. ప్రభుత్వ పెద్దల వద్ద వాపోయాం. అయినా ఇంత వరకు పెండింగ్‌ బిల్లులు చెల్లించలేదు. ఇప్పటి వరకు అప్పులు చేసి పనులు చేపట్టాం. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తేనే బయటపడగలం’ అని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆరు నెలలకే బిల్లులు వచ్చేవని.. చంద్రబాబు ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మమ్మల్ని నట్టేట ముంచుతోందని లబోదిబోమంటున్నారు.

రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు

జీవీఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన రూ.400 కోట్ల పెండింగ్‌ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు. తక్షణం పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ గత శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వేదికగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. 13 నెలలుగా బిల్లులు నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్టీఎఫ్‌, జీజీఎంపీ బిల్లులు వెంటనే చెల్లించాలని, ఈఎండీ, ఎఫ్‌ఎస్‌, ఏఎస్‌ఈల కింద కాంట్రాక్టర్లకు చెల్లించే డిపాజిట్లు రెండేళ్ల కాల వ్యవధి పూర్తయిన వెంటనే తమకు అందేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించాలని కోరారు. ముఖ్యంగా కాంట్రాక్ట్‌ పేమెంట్లు పద్ధతి ప్రకారం జరిపించాలని, జీవీఎంసీ బడ్జెట్‌లో నిధులున్న పనులకు మాత్రమే టెండర్లు పిలవాలని, ప్రభుత్వం నిర్వహిస్తున్న నిధి పోర్టల్‌ నుంచి జీవీఎంసీకి మినహాయింపు ఇవ్వాలని, జీవీఎంసీ అకౌంట్స్‌ అధికారులు చెల్లింపులు జరిపిన జాబితాను పోర్టల్‌లో పొందపరచాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement