రెండు నెలల క్రితమే నిర్ణయించాం..
గత ప్రభుత్వ హయాంలో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం..
అప్పుడు తీసుకొచ్చిన ప్రాజెక్టులను
చంద్రబాబు ప్రభుత్వం తన ఖాతాలో
వేసుకుంటోంది..
ఎంపీ భరత్ వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం
● మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన ర్యాలీ
మోంథా తుపాను కారణంగా వాయిదా వేశాం..
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసన ర్యాలీ చేయాలని రెండు నెలల క్రితం వైఎస్సార్ సీపీ అధిష్టానం నిర్ణయించిందని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. మద్దిలపాలంలో గల పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నెలలో జరగాల్సిన ఈ నిరసన ర్యాలీని మోంథా తుపాను కారణంగా ఈనెల 12వ తేదీకి వాయిదా వేసిందని పేర్కొన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో సీఐఐ సమ్మిట్ నిర్వహించడం ఇష్టం లేకనే వైఎస్సార్ సీపీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు ఎంపీ భరత్ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరుగుతుందన్నట్లు.. వైఎస్సార్ సీపీ హయాంలో ఏమి జరగనట్లు ఆయన మాటలున్నాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంటే.. ఆ పెట్టుబడులను చంద్రబాబు ప్రభుత్వం హయాంలో వచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆదాని డేటా సెంటర్, పోర్టుల నిర్మాణం వంటివి కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వచ్చినట్లే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ 17 నెలల పాలనలో చంద్రబాబు సర్కార్ విశాఖలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా.. రుషికొండ ప్యాలెస్‌ను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనవసరంగా నిర్మించారంటూ అవగాహనరాహిత్యంలో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. రుషికొండలో భవనాలు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంతం కాదని.. అవి ప్రభుత్వానివేనని మరిచిపోయి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ నెల 12న నిర్వహించే నిరసన ర్యాలీ ఆగదని పేర్కొన్నారు.


